సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి ఇప్పుడు వాహనాలతో నిండిపోతోంది. ఎక్కడ చూసినా కార్లు, బస్సుల తాకిడితో హైవే అంతా కిక్కిరిసిపోయింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ రికార్డు స్థాయికి చేరుకోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అంటే కేవలం 12 గంటల వ్యవధిలోనే సుమారు 70 వేల వాహనాలు ఏపీ వైపు వెళ్లినట్లు టోల్ సిబ్బంది వెల్లడించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు టోల్ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు అడుగుడుగునా ఎదురవుతున్నాయి. చిల్లకల్లు వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతుండగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వై జంక్షన్ వద్ద భారీగా జామ్ ఏర్పడింది. అక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో గంటల తరబడి ప్రయాణికులు వేచి చూడాల్సి వస్తోంది.

రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ఆర్టీసీ దాదాపు 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఏపీఎస్ఆర్టీసీ కూడా 600 కు పైగా బస్సులను అందుబాటులోకి తెచ్చింది. 

విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రైళ్లలో సీట్లు దొరక్కపోవడంతో చాలా మంది సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించేందుకు అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు.

అతివేగం వద్దు సంయమనం పాటించండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాహనాల్లో తగినంత ఇంధనం ఉండేలా చూసుకోవాలని కోరారు. రద్దీ సమయాల్లో కాకుండా కాస్త ముందుగా ప్రయాణం ప్లాన్ చేసుకోవడం మంచిది. వీలైతే పోలీసులు సూచించే ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లడం ద్వారా ట్రాఫిక్ కష్టాల నుండి తప్పించుకోవచ్చు.