గిల్ ను చూసి అభిషేక్ ఏం నేర్చుకోవాలి?

టీమ్ ఇండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ ఆట తీరు గురించి సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు. వీరిద్దరూ తన కళ్ల ముందే స్టార్ ప్లేయర్లుగా ఎదిగినా ఒకరిలో ఉన్న కసి మాత్రం వేరే లెవల్ అని యువీ చెప్పారు. ముఖ్యంగా గిల్ ఆటలో ఉన్న ఆ డెడికేషన్ అతన్ని అందరికంటే ముందు నిలబెట్టిందని ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

గిల్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో వివరిస్తూ.. సగటు ప్లేయర్ కంటే గిల్ నాలుగు రెట్లు ఎక్కువ కష్టపడతాడని యువీ మెచ్చుకున్నారు. కోవిడ్ కి కొంచెం ముందు సమయం నుంచి వీరిద్దరినీ తాను గమనిస్తున్నట్లు చెప్పారు. తాను ఏ చిన్న టిప్ ఇచ్చినా దాన్ని వెంటనే తన బ్యాటింగ్ లో అలవాటు చేసుకోవడం గిల్ లో ఉన్న గొప్ప లక్షణమని.. అందుకే అతను నేడు టీమ్ ఇండియా కెప్టెన్ స్థాయికి చేరాడని వెల్లడించారు.

అభిషేక్ శర్మ గురించి మాట్లాడుతూ.. కేవలం ఐపీఎల్ గురించి మాత్రమే ఆలోచించవద్దని తాను ముందే హెచ్చరించినట్లు యువీ గుర్తు చేశారు. దేశం కోసం ఆడాలనే లక్ష్యంతోనే ముందుకు వెళ్లమని చెప్పగా.. సరిగ్గా నాలుగేళ్ల మూడు నెలల్లోనే అతను ఇండియా టీమ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అభిషేక్ లో టాలెంట్ కి కొదవ లేకపోయినా దాన్ని ఒక పద్ధతిలో పెట్టి సక్సెస్ వైపు నడిపించడమే తన పని అని యువీ అన్నారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న మెయిన్ డిఫరెన్స్ ని కూడా యువీ బయటపెట్టారు. గిల్ క్రీజులో కాసేపు సమయం తీసుకుని నిలదొక్కుకుంటాడని.. అందుకే అతను అంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాడని చెప్పారు.

అభిషేక్ బ్యాటింగ్ స్టైల్ మాత్రం పూర్తిగా అటాకింగ్ గా ఉంటుందని.. అయితే తన వికెట్ కి వాల్యూ ఇవ్వడంలో గిల్ ఒక అడుగు ముందే ఉన్నాడని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటి తరం ఆటగాళ్లకు అవుట్ అవుతామనే భయం లేదని.. అందుకే విచ్చలవిడిగా హిట్టింగ్ చేస్తున్నారని యువీ విశ్లేషించారు. కేవలం 20 బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్ లు కాకుండా గిల్ లాగా సెంచరీల వైపు చూడాలని అభిషేక్ కి సలహా ఇచ్చారు. అనవసర రిస్క్ తగ్గించుకుని క్రీజులో ఎక్కువ సమయం గడిపితేనే టీమ్ లో ఎక్కువ కాలం కొనసాగవచ్చని యువరాజ్ సింగ్ స్పష్టం చేశారు.