నెలా పదిహేను రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్న హామీని 10 రోజుల ముందే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణ పనులకు పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
కోనసీమ కొబ్బరి రైతులతో గత నెల మాట్లాడిన సందర్భంగా 45 రోజుల్లో సమస్యకు పరిష్కారం చూపుతానని ఇచ్చిన హామీని ఆయన 10 రోజుల ముందుగానే అమలు చేసి, 35 రోజుల్లోనే రూ.20.77 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారు.
రాజోలు పర్యటనలో రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా విన్న పవన్ కళ్యాణ్, శంకరగుప్తం మేజర్ డ్రెయిన్ ఆధునీకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ముక్కోటి పర్వదినాన సమస్యకు పరిష్కార దిశగా అడుగు పడటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను గమనించి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, సమస్యల శాశ్వత పరిష్కారానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వర్చువల్‌గా హాజరుకాగా, శంకరగుప్తంలో జరిగిన కార్యక్రమంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates