తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు ప్రతి ఏటా వేలాదిమంది అమెరికాకు వెళ్తుంటారు. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు ఉండడంతో సప్త సముద్రాలు దాటి అమెరికాలో పనిచేసేందుకు భారత్ తోపాటు ఎన్నో దేశాల ప్రజలు ఆసక్తి చూపుతుంటారు. అయితే, రూపాయి విలువ డాలర్ తో పోల్చితే పతనమైనపుడు మాత్రం భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెదురుతుంటాయి. తాజాగా ఈ రోజు రూపాయి యూఎస్ డాలర్‌తో మారకపు విలువ 89.97(దాదాపు 90 రూపాయలు) సరికొత్త రికార్డు కనిష్టాన్ని తాకింది.
సోమవారం నాడు నమోదైన 89.78 కు మించి మంగళవారం నాడు మన రూపాయి మరింత పతనమైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చితే 4.85 శాతం పతనాన్ని నమోదు చేసింది. అయితే, ఆశ్చర్యకరంగా నవంబర్ 3 నుంచి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఏకంగా రూపాయికి పైగా పడిపోయింది. రూపాయి పతనానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయని ఆర్థిక శాఖా నిపుణులు అంచనా వేస్తున్నారు.
నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్ (ఎన్డీఎఫ్) కాంట్రాక్టుల గడువు ముగియనుండడం ఒక కారణమని కోటక్ సెక్యూరిటీస్‌కు చెందిన ఆనంద్య బెనర్జీ అభిప్రాయపడ్డారు. ఫారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్ పీఐలు) భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకుంటూ రోజువారీగా డాలర్లను కొనుగోలు చేయడం మరొక కారణమని డీఎస్పీ ఫైనాన్స్‌కు చెందిన జయేష్ మెహతా వెల్లడించారు. రూపాయి పతనమవుతున్నప్పటికీ నిరోధించే ప్రయత్నాలు ఆర్బీఐ చేసినట్లు కనిపించలేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే, డాలర్ తో రూపాయి మారకపు విలువ 90 మార్కు దాటకుండా నిరోధించేందుకు ఆర్‌బీఐ డాలర్లను విక్రయించినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates