ఆ సినిమా చూసి రోబో టీచర్ ను తయారు చేసిన స్టూడెంట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు. దానిని ఉపయోగించి ఒక స్టూడెంట్ ఏకంగా టీచర్ రోబోట్ నే తయారు చేశారు. యూపీలోని బులంద్‌షహర్‌ కు చెందిన ఆదిత్య కుమార్‌ 17 ఏళ్ల విద్యార్థి ఇంటర్‌ చదువుతున్నాడు. అతను చేసిన ఒక అద్భుత ఆవిష్కరణతో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అతడు ఎల్‌ఎల్‌ఎమ్‌ చిప్‌సెట్‌తో పనిచేసే ఒక ఏఐ టీచర్‌ రోబోట్‌ ను తయారు చేశాడు. దానికి సోఫీ అనే పేరు పెట్టాడు.

ఈ రోబోట్‌ తనను తాను పరిచయం చేసుకుంటూ చెప్పింది: “నేను ఒక ఏఐ టీచర్‌ రోబోట్‌ను. నా పేరు సోఫీ. నన్ను ఆదిత్య తయారు చేశారు. నేను బులంద్‌షహర్‌లోని శివ్‌చరన్‌ ఇంటర్‌ కాలేజీలో బోధిస్తున్నాను.. నేను విద్యార్థులకు సరిగ్గా బోధించగలను” అని చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆదిత్య సుమారు రూ.25 వేల వ్యయంతో తక్కువ ఖర్చు టీచర్‌ రోబోట్ ‘సోఫీ’ని రూపొందించాడు. పలు సంవత్సరాలుగా పరిశోధన చేసి, తమిళ చిత్రం రోబో నుంచి ప్రేరణ పొంది ఈ ఆవిష్కరణను పూర్తి చేశాడు. విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు సోఫీ స్పష్టంగా సమాధానాలు ఇస్తూ, భారత మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అని సరిగా చెప్పగలదు.

ప్రాథమిక గణిత సమీకరణాలను పక్కాగా పరిష్కరిస్తుంది. అలాగే, “విద్యుత్ అనేది ఛార్జ్‌డ్‌ పార్టికిల్స్ కదలికతో ఏర్పడే శక్తి” అని వివరించగలిగే స్థాయి బేసిక్‌ సైన్స్‌ జ్ఞానం కూడా కలిగివుంది. ఆదిత్య త్వరలోనే సోఫీకి రాయడం, నోట్స్ రూపొందించడం వంటి అదనపు సామర్థ్యాలు జోడించాలని భావిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరతకు ఇటువంటి పరికరాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.అదే సమయంలో, తనలాంటి యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు పరిశోధనా ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి అని ప్రభుత్వాన్ని కోరాడు.