44 మంది అగ్నికి ఆహుతి.. ఆ దేశంలో ఘోరం!

ఏషియన్ వరల్డ్ సిటీగా పిలుచుకునే హాంకాంగ్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 44 మంది అగ్నికీలలకు ఆహుతి కాగా 250 మందికిపైగా ఆచూకీ తెలియలేదు. న్యూ టెరిటరీస్‌లోని థాయ్‌ పో జిల్లాలో ఉన్న ఒక పెద్ద నివాస సముదాయంలో బుధవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే మిగతా అపార్ట్మెంట్ లకు విస్తరించాయి.

మొదట 32 అంతస్తుల భవనం బయట మంటలు అంటుకున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బాంబూ స్కాఫోల్డింగ్ వద్ద మంట రేగి.. అక్కడ ఉన్న ప్లాస్టిక్ నెట్టింగ్, కాన్వాస్ కవర్, నిర్మాణ సామగ్రి మంటలను వేగంగా వ్యాపింపజేశాయి. బలమైన గాలి వీచడంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు పాకినట్లు స్థానికులు చెబుతున్నారు.

అక్కడ స్థానికంగా ఎనిమిది భవనాలు, వాటిలో రెండు వేల పైగా ఇల్లు ఉన్నాయి. ప్రమాదం సంభవించిన సమయంలో పై అంతస్తులు కొంత మంది చిక్కుకుపోయారు. వారిలో వృద్ధులు కూడా ఉన్నట్లు సమాచారం. 140 ఫైరింజన్లు, 60 అంబులెన్స్‌లు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. వందలాది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది చేరుకున్నారు. భారీ అగ్ని ప్రమాదం హాంకాంగ్‌లో దాదాపు 30 ఏళ్లలో అత్యంత ఘోరమైనదిగా గుర్తిస్తున్నారు. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.