బందీగా 738 రోజులు.. యుద్ధం దాటి వచ్చిన ప్రేమలు

​ప్రేమకు యుద్ధం కూడా అడ్డు కాదని చెప్పడానికి ఈ కథే ఒక నిదర్శనం. ఇజ్రాయెల్ జంట నోవా అర్గామణి, అవినాతన్ ఓర్‌ల కలయిక ప్రపంచాన్ని కదిలించింది. హమాస్ చెరలో సరిగ్గా 738 రోజులు (రెండు సంవత్సరాలు) బందీగా ఉన్న ఓర్‌.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా విడుదలైన 20 మందిలో ఒకరు. రయీమ్ క్రాసింగ్‌లో ఓర్‌ తన గదిలోకి అడుగు పెట్టగానే, గత ఏడాదే రెస్క్యూ అయిన అతని ప్రియురాలు నోవా అర్గామణి అతనివైపు పరిగెత్తుకెళ్లింది.

​వారు ఇద్దరూ హగ్ చేసుకున్న దృశ్యం, ఓర్‌ తన ప్రియురాలిపై ప్రేమతో ముద్దుల వర్షం కురిపించిన వీడియో, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. “చివరికి నోవా అర్గామణి, అవినాతన్ ఓర్‌లు కలిశారు” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఈ ఫోటోలను షేర్ చేసింది. ప్రేమ బంధాన్ని విడదీయాలని యుద్ధం ప్రయత్నించినా, అది సాధ్యం కాలేదని ఈ కలయిక మరోసారి నిరూపించింది.

​రెండు సంవత్సరాల క్రితం, అక్టోబర్ 7న, ఈ జంట సరదాగా గడపాలని నోవా మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లారు. కానీ అది కాస్తా గాజాలోని చీకటి సొరంగాల్లో బందీ జీవితాన్ని ఇచ్చింది. అక్టోబర్ 7 రాత్రి జరిగిన భయానక ఘటనను నోవా గతంలో గుర్తు చేసుకున్నారు. “వేలాది మంది యువకులు పరుగెత్తారు, వందలాది కార్లు తప్పించుకోవడానికి ట్రై చేశాయి, అంతా చంపొద్దని వేడుకున్నారు” అని ఆమె తన సోషల్ మీడియా పోస్ట్‌లో రాశారు. తాను బందీగా ఉన్నప్పుడు తన పార్ట్‌నర్ ఎక్కడున్నాడో, చనిపోయాడో కూడా తెలియక భయపడ్డానని నోవా అన్నారు.

​బలవంతంగా గాజాలోకి తీసుకెళ్తున్నప్పుడు నోవా అర్గామణి ఏడుస్తూ కనిపిస్తున్న పాత ఫుటేజ్ అప్పట్లో వైరల్ అయ్యింది. చైనీస్ జన్మిత ఇజ్రాయెల్ పౌరురాలైన నోవా, 245 రోజుల బందీ జీవితం తర్వాత గత ఏడాదే ఐడీఎఫ్ రెస్క్యూ ఆపరేషన్‌లో సేఫ్ గా బయటపడింది. విడుదలైనప్పటి నుంచి ఆమె మిగిలిన బందీల విడుదల కోసం గట్టిగా పోరాడుతున్నారు. ​ఓర్‌ విడుదలైన వెంటనే, అతను పనిచేసిన ఎన్విడియా కంపెనీ సీఈఓ జెన్సెన్ హువాంగ్ స్టాఫ్‌కు ఒక ఎమోషనల్ లెటర్ రాశారు.

“రెండు సంవత్సరాల తర్వాత అవినాతన్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతని తల్లి ధైర్యం, ఆశ ఈ కష్ట కాలాన్ని దాటించాయి” అని ఆయన అన్నారు. ఆ యుద్ధంలో ఎన్విడియాకు చెందిన ఉద్యోగులను, వారి భాగస్వాములను కోల్పోయిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఓర్‌ నోవా జంటతో పాటు, ఆ రోజు చాలా మంది బందీలు తమ కుటుంబాలను కలుసుకుని కన్నీళ్లతో ఎమోషనల్ అయ్యారు.