ఐపీఎల్‌లో ముంచేశారు.. ఇప్పుడేమో ఇలా

ఇండియన్ ప్రిమియర్ లీగ్‌లో పేరు గొప్ప ఊరు దిబ్బ అనిపించిన ప్లేయర్లు చాలామందే ఉన్నారు. భారీ రేటు పెట్టి తమను సొంతం చేసుకున్న ఫ్రాంఛైజీలను వాళ్లు దారుణంగా దెబ్బ కొట్టారు. ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు రేటు పెట్టి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ దక్కించుకున్న ప్యాట్ కమిన్స్ ఎలా తుస్సుమనిపించాడో తెలిసిందే. ఈ కోవలో చాలామందే ఉన్నారు.

ఐతే ఐపీఎల్‌లో సరిగా ఆడని ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున మెరుస్తుండటం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నిన్నటి ఇండియా-ఆస్ట్రేలియా మ్యాచే ఇందుకు నిదర్శనం. ఐపీఎల్‌లో కోహ్లి నాయకత్వం వహించే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఓపెనర్‌గా ఆరోన్ ఫించ్ ఎంత పేలవ ప్రదర్శన చేశాడో తెలిసిందే. ఆ వైఫల్యాలు చూసి అతను ఫామ్‌లో లేడని అంతా అనుకున్నారు.

కానీ ఆస్ట్రేలియాకు వన్డే, టీ20 జట్లలో కెప్టెన్ అయిన ఫించ్.. అంతర్జాతీయ మ్యాచ్ అనగానే ఎక్కడ లేని బాధ్యతతో ఆడేశాడు. భారత్‌తో తొలి వన్డేలో ఎంతో నిలకడగా ఆడి సెంచరీ సాధించాడు. 114 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఇదే మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఎలా చెలరేగిపోయాడో తెలిసిందే. కేవలం 19 బంతుల్లో అతను 45 పరుగులు చేశాడు. చివర్లో అతడి మెరుపులే ఆస్ట్రేలియాకు రికార్డు స్కోరు సాధించి పెట్టాయి. ఐతే ఈ మ్యాక్స్‌వెల్ ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున దారుణమైన ప్రదర్శన చేశాడు. టోర్నీ మొత్తంలో అతను ఒక్క అర్ధశతకం కూడా చేయలేదు. ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదు. ఇండియా మీద మాత్రం ఆడిన 19 బంతుల్లోనే మూడు సిక్సర్లు బాదాడు.

మరోవైపు పంజాబ్ ఆటగాడే అయిన జిమ్మీ నీషమ్.. శుక్రవారం న్యూజిలాండ్ తరఫున చెలరేగి ఆడాడు. వెస్టిండీస్‌తో 24 బంతుల్లోనే 48 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఐపీఎల్‌లో ఫెయిలైన ఆటగాళ్లు జాతీయ జట్ల తరఫున ఇలా చెలరేగిపోవడంపై సోషల్ మీడియాలో బోలెడన్ని మీమ్స్ వస్తున్నాయి. బ్రహ్మిని వాడుకుని మనోళ్లు చేస్తున్న కామెడీ చూస్తే కడుపు చెక్కలవ్వాల్సిందే.