వైన్ షాపులు బంద్.. అయినా రికార్డు

ఏదైనా పెద్ద పండుగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ఒక రేంజిలో జరుగుతాయి. ముఖ్యంగా తెలంగాణలో అయితే మద్యం ఏరులై పారుతుంది. మిగతా పండుగలన్నీ ఒకెత్తయితే.. దసరా ఇంకో ఎత్తు. మందుతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంతకంటే మంచి సందర్భం మరొకటి ఉండదని భావిస్తారు ఇక్కడి జనాలు. ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డులు నమోదవుతుంటాయి దసరాకు. ఈ ఏడాది ఒక నంబర్ చూసి ఆశ్చర్యపోతే.. తర్వాతి ఏడాది అంతకుమించిన నంబర్ చూస్తాం.

ఐతే ఈసారి రికార్డులు బద్దలు కావడం కష్టమే అనుకున్నారంతా. అందుక్కారణం.. దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు రావడమే. అందుకే గత గురువారం వైన్ షాపులు మూతపడ్డాయి. కానీ దసరా సీజన్లో మద్యం అమ్మకాలు మాత్రం తక్కువగా లేవు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ అమ్మకాలే జరిగాయి.

గత ఏడాది దసరా సీజన్లో 8 రోజుల వ్యవధిలో రూ.852 కోట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది కేవలం మూడు రోజుల వ్యవధిలోనే రూ.700 కోట్ల మద్యం అమ్మకాలు జరగడం విశేషం. గురువారం గాంధీ జయంతి కావడంతో అంతకు రెండు రోజుల ముందు నుంచే మందుబాబులు మద్యం కొని పెట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఒక్క సెప్టెంబరు 30న మాత్రమే రికార్డు స్థాయిలో రూ.333 కోట్లు మద్యం అమ్ముడైంది. తెలంగాణలో ఒక్క రోజు వ్యవధిలో జరిగిన రికార్డుల అమ్మకాలు ఇవి.

గాంధీ జయంతి రోజు దసరా రావడం మీద సోషల్ మీడియాలో మీమ్స్ మోతెక్కిపోయాయి. ఆ రోజు మాంసం దుకాణాలు కూడా బంద్ కావడంతో నాన్ వెజ్ అమ్మకాలు కూడా ముందు రోజు రికార్డు స్థాయిలోనే జరిగి ఉంటాయని అంచనా. ఏపీలో సైతం దసరాకు ముందు రోజు మద్యం, మాంసం అమ్మకాలు భారీ స్థాయిలోనే జరిగినట్లు తెలుస్తోంది.