షాకింగ్… వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ ఔట్

భారత క్రికెట్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే టెస్టు జట్టు పగ్గాలు చేపట్టిన శుభ్‌మన్ గిల్.. ఇప్పుడు వన్డే జట్టు సారథిగానూ నియమితుడయ్యాడు. కొన్ని రోజుల నుంచి కొనసాగుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ.. అతణ్ని వన్డే కెప్టెన్‌గా నియమించారు సెలక్టర్లు. ఇప్పటిదాకా వన్డే జట్టును నడిపించిన రోహిత్ శర్మ.. ఇకపై జట్టు సభ్యుడిగా మాత్రమే కొనసాగనున్నాడు. ఆస్ట్రేలియాతో ఈ నెల 19 నుంచి జరిగే వన్డే సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన సందర్భంగా ఈ మేరకు మార్పులు జరిగాయి. రోహిత్‌తో పాటు కోహ్లి కూడా ఈ సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు కొత్తగా శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఇదే పర్యటనలో భారత జట్టు టీ20లు కూడా ఆడనుంది. ఇటీవల ఆసియా కప్‌లో జట్టును విజేతగా నిలిపిన సూర్యకుమార్ యాదవే ఆ సిరీస్‌కు కూడా కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దానికి గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు.  రోహిత్ ఏడాది కిందట మూడు ఫార్మాట్లలో సారథిగా ఉన్నాడు. ఐతే గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపిన అనంతరం అతను టీ20లకు గుడ్ బై చెప్పేశాడు. అప్పుడే సూర్య పగ్గాలందుకున్నాడు.

ఆ ఏడాది సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌లో వైట్ వాష్‌కు గురి కావడం, ఆపై ఆస్ట్రేలియాలోనూ సిరీస్ ఓడిపోవడంతో రోహిత్ టెస్టు కెరీర్ ప్రమాదంలో పడింది. సెలక్టర్లు ఒత్తడి చేశారో లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నాడో కానీ ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటన ముంగిట అతను టెస్టులకు టాటా చెప్పేశాడు. కోహ్లి సైతం అదే బాటలో నడిచాడు. దీంతో టెస్టు పగ్గాలు శుభ్‌మన్ చేతికి వచ్చాయి. టీ20లు, టెస్టుల నుంచి తప్పుకున్నాడు కాబట్టి ఇక వన్డేల్లో కొనసాగుతూ 2027 ప్రపంచకప్ వరకు అతను కెప్టెన్‌గా కొనసాగుతాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా అతణ్ని కెప్టెన్‌గా పక్కన పెట్టి శుభ్‌మన్‌ను సారథిగా ఎంపిక చేశారు. రోహిత్‌తో సంప్రదించాకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు.