హైదరాబాద్ మెట్రోలో ఒక ప్రయాణికుడికి బుధవారం చేదు అనుభవం ఎదురైంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌లో భద్రతా సిబ్బంది తనిఖీల సమయంలో ఆయన వద్ద రూ.3.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం గరిష్టంగా రూ.2 లక్షల వరకు మాత్రమే నగదుతో ప్రయాణం అనుమతిస్తారని సిబ్బంది తెలియజేయడంతో, ఆ వ్యక్తి నగదుతో వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. సాధారణంగా జనాలకు ఇలాంటి విషయాల్లో అవగాహన తక్కువే.
చాలా మంది ప్రయాణికులు పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లడంపై కచ్చితమైన పరిమితులు ఉన్నాయనే విషయం తెలియదు. మెట్రోలో మాత్రమే కాకుండా, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లలో కూడా ఇలాంటి నియమాలు అమల్లో ఉన్నాయి. భద్రతా సిబ్బంది నగదు మూలం గురించి అనుమానం వస్తే, అది మనీ లాండరింగ్ లేదా అక్రమ లావాదేవీలుగా పరిగణించే అవకాశం ఉంటుంది. అందుకే రిజర్వ్ బ్యాంక్ గరిష్ట పరిమితిని నిర్ణయించింది.
ఈ నియమాలు అమల్లో ఉండటానికి ముఖ్య కారణం అక్రమ డబ్బు ప్రవాహాన్ని అరికట్టడం. పెద్ద మొత్తంలో నగదు తీసుకు వెళ్లడం వలన దొంగతనాలు, మోసాలు జరగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, ఎన్నికల సమయంలో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో భారీ నగదు మోసుకెళ్తే అది అధికారుల అనుమానాలను రేకెత్తిస్తుంది. అందువల్లే భద్రతా తనిఖీల్లో కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ప్రమాదాలను నివారించడానికి, ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటే బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, డిమాండ్ డ్రాఫ్ట్, ఆన్‌లైన్ పేమెంట్స్ వంటి సురక్షిత మార్గాలను ఉపయోగించడం మంచిది. ఇవి కేవలం సురక్షితం మాత్రమే కాదు, ఎప్పుడైనా ఆధారాలను చూపించడానికి కూడా సహాయపడతాయి. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడటం వలన ఇలాంటి ఇబ్బందులను పూర్తిగా తప్పించుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates