ఆసియా కప్ టీ20 టోర్నీ సందర్భంగా ఒక క్రికెట్ మ్యాచ్‌లో ఎన్నడూ చూడని ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. పహల్గాం దాడి అనంతరం పరిణామాలతో పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దే వద్దంటూ స్వదేశంలో నిరసనలు సాగుతున్న సమయంలో ఆ జట్టుతో తలపడిన భారత ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు సభ్యులతో కనీసం కరచాలనం కూడా చేయలేదు. దానికి బదులుగా తర్వాతి మ్యాచ్‌లో ఒక పాక్ ఆటగాడు గన్ ఫైర్ సంబరాలతో కవ్వించే ప్రయత్నం చేస్తే.. మరో ఆటగాడు భారత యుద్ధ విమానాలను పాక్ నిజంగానే కూల్చేసినట్లుగా 6-0 సంజ్ఞతో రెచ్చగొట్టాలని చూశాడు.
ఇక ఫైనల్ సందర్భంగానూ ఇరు జట్ల ఆటగాళ్లలో భావోద్వేగాలు పతాక స్థాయికి చేరాయి. ముచ్చటగా మూడోసారి పాక్‌ను ఓడించిన భారత్ ఆసియా కప్ విజేతగా నిలిచింది. కానీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో పాకిస్థాన్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి ట్రోఫీని ప్రదానం చేయాల్సి ఉండగా.. భారత జట్టు అతడి చేతుల మీదుగా కప్పు తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో ట్రోఫీ ప్రదానమే జరగలేదు.
మరో అతిథి చేతుల మీదుగా ఇండియాకు కప్పు ఇచ్చే అవకాశమున్నా.. నఖ్వి అందుకు ఒప్పుకోకపోవడంతో ట్రోఫీ లేకుండానే సంబరాలు చేసుకుంది భారత జట్టు.
భారత్ చర్యను ఖండిస్తూ ఇండియన్ టీం క్రికెట్‌ను అగౌరవపరిచిందని పేర్కొన్నాడు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా. అలా అన్నవాడు ప్రెజెంటేషన్ టైంలో, తర్వాత ప్రెస్ మీట్‌లో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. రన్నరప్ కింద అతడికి చెక్ అందజేయగా అది అందుకున్న అనంతరం దాన్ని అతను విసిరి అవతల పడేసి మ్యాచ్ ప్రెజెంటర్ దగ్గరికి వెళ్లాడు. క్రికెట్‌ను అగౌరవపరచడం అంటే ఇదీ అంటూ అతడి మీద నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్లో ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీ ద్వారా వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, సైన్యానికి అందిస్తున్నట్లు ప్రకటించాడు.
దీన్ని పాక్ కెప్టెన్ కాపీ కొట్టాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి తమ మ్యాచ్ ఫీజులను ఇస్తామన్నాడు. ఐతే ఆపరేషన్ సిందూర్‌లో భారత్ మట్టుబెట్టింది ఉగ్రవాదుల శిబిరాలను అని ప్రపంచానికి తెలుసు. వాళ్ల కుటుంబాలకు డబ్బులు ఇవ్వడం అంటే ఉగ్రవాదులకు తమ ప్రోత్సాహం ఉంటుందని చెప్పడమే. పాకిస్థాన్ టెర్రరిస్ట్ కంట్రీ అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలంటూ మన వాళ్లు కౌంటర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates