టార్గెట్ పెట్టుకోవటం వేరు. దాన్ని సాధించేందుకు తగిన కష్టం వేరు. అయితే.. సక్సెస్ ఉత్తనే రాదు. దాని కోసం చాలానే కష్టపడాలి. కాలం విసిరే సవాళ్లకు ఎదురొడ్డాలి. అన్ని ప్రతికూలతల్ని ఎదుర్కొన్నప్పుడు మాత్రమే సానుకూలత ఎదురవుతుంది. ఇప్పుడు చెప్పేది అలాంటి కష్టాల్ని.. ఇబ్బందుల్ని ఎదుర్కొని.. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ఎనిమిదేళ్లు అలుపెరగని పోరాటం చేసిన అతను చివరకు తాను అనుకున్నది సాధించాడు. ఈ యువకుడి విజయగాథ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మొన్నటి వరకు స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేసిన ఆ యువకుడు ఇప్పుడు ఏకంగా డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికైన వైనం ఎందరికో స్పూర్తిగా మారాడు.
జార్ఖండ్ కు చెందిన సూరజ్ యాదవ్ ఒక సామాన్యుడు. తండ్రి ఒక మామూలు మేస్త్రీ. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉండే ఆ కుటుంబం తరచూ ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉండేది. అయినప్పటికి భారీ లక్ష్యాన్ని పెట్టుకున్న అతను.. అందుకోసం ఒకవైపు ప్రయత్నిస్తూనే.. మరోవైపు స్నేహితుల సాయంతో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేసి డెలివరీ ఏజెంట్ గా.. స్విగ్గీ బాయ్ గా పని చేసేవాడు.
రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించే క్రమంలో భార్య అతనికి మద్దతుగా నిలిచేది. పగలంతా పలు ఉద్యోగాలు చేసి.. అలసి ఇంటికి చేరుకున్నప్పటికి పట్టువిడకుండా చదివేవాడు. అతడి ఎనిమిదేళ్ల కష్టానికి ఫలితంగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ లో పాస్ కావటమే కాదు.. 110వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్ గా నియమితులయ్యాడు.
ఇంటర్వ్యూ వేళ.. తనకు ఎదురైన ప్రశ్నలకు సమాధానాలుచెప్పేందుకు డెలివరీ ఉద్యోగంలో ఎదురయ్యే సవాళ్లు.. టైం మేనేజ్ మెంట్.. లాజిస్టిక్స్ కు సంబంధించిన విలువైన పాఠాల్ని నేర్పిందని.. అదే తనకు ఇంటర్వ్యూను మరింత బాగా చేసేందుకు సాయం చేసినట్లు చెప్పారు. నిన్నటి వరకు అందరిని స్విగ్గీ డెలివరీ బాయ్ గా పిలిచే అతన్ని ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ గా గౌరవంగా పిలుస్తున్నట్లు చెబుతున్నారు. తాను సాధించిన సక్సెస్ గురించి తన భార్యకు ఫోన్ చేసి చెప్పిన తర్వాత.. భావోద్వేగంతో ఇద్దరం తనివితీరా ఏడ్చేసినట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పట్టు విడవకుండా ప్రయత్నిస్తే లక్ష్యానికి చేరుకోవచ్చన్న దానికి నిదర్శనంగా సూరజ్ ఉదంతం నిలుస్తుందని చెప్పక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates