గత ఆదివారం ఆసియా కప్ టీ20 టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన భారత జట్టు.. మ్యాచ్ అనంతరం వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచిన అనంతరం.. అతడికి భారత సారథి సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక మ్యాచ్ అనంతరం కూడా భారత ఆటగాళ్లెవ్వరూ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయలేదు. ఇండియన్ టీం కోసం కాసేపు ఎదురు చూసిన పాకిస్థాన్ ఆటగాళ్లు.. వెళ్లిపోయారు. దీన్ని పాక్ ఆటగాళ్లు అవమానంగా భావించారు. పాకిస్థాన్ కెప్టెన్ ప్రెజెంటేషన్, విలేకరుల సమావేశంలోనూ పాల్గొనలేదు. అంతటితో వ్యవహారం ముగిసిపోయిందనుకున్నారంతా. కానీ పాక్ దీన్ని పెద్ద వివాదం చేయాలనుకుంది.
భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడానికి బాధ్యుడిగా మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను పేర్కొంటూ అతణ్ని తొలగించాలని ఐసీసీని డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ అందుకు ఒప్పుకోలేదు. పైక్రాఫ్ట్‌ను తప్పించకపోతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించింది. అయినా ఐసీసీ స్పందించలేదు. దీంతో పాక్ అహం దెబ్బతింది. ఛాలెంజ్ చేసి సైలెంట్ అయితే మరింతగా పరువు పోతుందని.. బుధవారం యూఏఈతో మ్యాచ్ సమయానికి స్టేడియానికి రాకుండా బెట్టు చేసింది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడైన పాకిస్థాన్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వి జోక్యం చేసుకుని తమ జట్టును స్టేడియానికి రప్పించాడు.
పైక్రాఫ్ట్‌ను కనీసం తమ మ్యాచ్ వరకు అయినా దూరం పెట్టాలని పాక్ కోరగా.. అందుకు కూడా ఐసీసీ అంగీకరించలేదు. ఈ వివాదంలో ఆయన తప్పేమీ లేదని స్పష్టం చేసింది. ఐతే జరిగిన దానికి పైక్రాఫ్ట్ పాక్ జట్టుకు సారీ చెప్పాడని.. తర్వాతే తమ ఆటగాళ్లు మైదానానికి కదిలారని పాక్ బోర్డు ప్రకటించుకుంది. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. పైక్రాఫ్ట్ నుంచి కూడా అధికారిక ప్రకటన ఏమీ లేదు. పాక్ ఆటగాళ్లతో పైక్రాఫ్ట్ మాట్లాడుతున్న వీడియో మాత్రం రిలీజ్ చేశారు.
అందులో ఏమీ సారీ చెబుతున్న సంకేతాలు కనిపించలేదు. ‘రగడ’ సినిమాలో బ్రహ్మానందం పార్టీకి ఇన్విటేషన్ లేకుండా నేనెలా వెళ్తా అని చెప్పి, తనకు తానే ఇన్విటేషన్ రాసుకున్నట్లు.. పైక్రాఫ్ట్ సారీ చెప్పినట్లు పాక్ ఆటగాళ్లు తమకు తాము అనేసుకుని మ్యాచ్‌కు వచ్చేసినట్లుగా ఉంది పరిస్థితి. టోర్నీని బహిష్కరిస్తే రూ.140 కోట్లకు పైగా నష్టం వాటిల్లే పరిస్థితి ఉండగా.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాక్ బోర్డు ఆ పని ఎందుకు చేస్తుందంటూ సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు పడుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates