నాగమల్లయ్యకు మంచి పేరు ఉంది: ట్రంప్

డాలస్‌లో భారతీయుడు చంద్ర నాగమల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటన అమెరికాలో తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు నిందితుడని తేలింది. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై అక్రమ వలసలను ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన స్పష్టంచేశారు. అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే తమ లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.

చంద్ర నాగమల్లయ్యను నిందితుడు మార్టినెజ్‌ తన భార్య, కుమారుడి ఎదుటే హత్య చేయడం ఘటనను మరింత దారుణంగా మార్చింది. ఆయన తలను నరికి చెత్తబుట్టలో పడేయడం అమెరికా వ్యాప్తంగా ఆగ్రహానికి దారితీసింది. వెంటనే పోలీసులు మార్టినెజ్‌ను అదుపులోకి తీసుకుని ఫస్ట్ డిగ్రీ మర్డర్ కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనతో అక్కడి భారతీయ కమ్యూనిటీ కూడా షాక్‌లో మునిగిపోయింది.

ట్రంప్ ఈ కేసుపై స్పందిస్తూ, “నాగమల్లయ్యకు డాలస్‌లో మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తిని అక్రమ వలసదారుడు చంపేశాడు. ఈ ఘటన వెనుక సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి” అని పేర్కొన్నారు. గతంలోనే మార్టినెజ్‌పై లైంగిక దాడి, దొంగతనం వంటి అనేక నేరాలు నమోదయ్యాయని, అయినప్పటికీ బైడెన్ ప్రభుత్వం అతడిని అమెరికాలో ఉంచిందని ఆయన ధ్వజమెత్తారు. క్యూబా కూడా అలాంటి నేరస్తులను వద్దనుకోవడంతో అమెరికా తలుపులు తెరవడం తప్పు అని ట్రంప్ విమర్శించారు.

“ఇకపై అక్రమ వలసదారులపై మృదువైన వైఖరి ఉండదు. అమెరికా ప్రజల భద్రత కోసం కఠిన చర్యలు తప్పవు” అని ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ట్రంప్ గతంలో కూడా వలస విధానాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మళ్లీ అదే దిశగా అడుగులు వేయబోతున్న సంకేతాలు ఇచ్చారు.