ఇదొక అరుదైన సంఘటన.. భారీ ధర పెట్టి ఒక కొత్త కారు కొని శుభప్రదమనే ఉద్దేశంతో షోరూంలో నిమ్మకాయల్ని తొక్కించబోయిన ఓ మహిళ.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారుతో సహా వచ్చి రోడ్డు మీద పడింది. ఈ ఘటనలో కారు ధ్వంసం కాగా.. అదృష్టవశాత్తూ సమయానికి ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో ఆమెతో పాటు షోరూం సిబ్బంది ఒకరు గాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే..?
29 ఏళ్ల మాని పవార్, ఆమె భర్త ప్రదీప్ కలిసి.. ఢిల్లీలోని నిర్మాన్ విహార్‌లో ఉన్న మహీంద్రా షోరూం నుంచి థార్ కారును కొనుగోలు చేశారు. దాని ధర రూ.27 లక్షలు. కారు తాళాలు అందుకున్నాక ఆమె అక్కడే చిన్న పూజా కార్యక్రమం లాంటిది చేసుకున్నారు. అనంతరం కారు టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి తొక్కించాలని భావించారు. వీళ్లు కొన్న కారు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. అక్కడే ఈ నిమ్మకాయల్ని తొక్కించే పని పెట్టుకున్నారు. మాన్వినే కారును డ్రైవ్ చేసింది. షోరూం సిబ్బంది ఒకరు ఆమెతో పాటు కారులోకి ఎక్కారు. ఐతే నిమ్మకాయల్ని తొక్కించేందుకు కొంచెం నెమ్మదిగా కారును ముందుకు పోనిచ్చిన మాని.. అనుకోకుండా ఎక్సలేటర్ మీద కాలు వేసింది. కంగారులో కారును కంట్రోల్ చేయలేకపోయింది.
దీంతో అద్దాలను బద్దలు కొట్టుకుని కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూసుకొచ్చి రోడ్డు మీద బోర్లా పడింది. కారు కింద పడడానికి ముందే అందులో ఉన్న షోరూం ఉద్యోగి కిందికి దూకేశాడు. అతడికి గాయాలయ్యాయి. సమయానికి ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో మానికి తీవ్ర గాయాలేమీ కాలేదు. కానీ 27 లక్షలు పెట్టి కొన్ని కొత్త కారు మాత్రం ధ్వంసమైంది. ఈ వార్త, దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates