మనిషి శ్వాస ఆగిపోతే కథ ముగిసినట్టేనా? శరీరం చల్లబడిపోతే అంతేనా? వైద్యశాస్త్రం మాత్రం ఈ ప్రశ్నలకు కొత్త సమాధానాలు వెతుకుతోంది. అందుకే మృత్యువుకి తలొగ్గకుండా మళ్లీ జీవితం ఇవ్వగలమనే ఆశతో పుట్టిన విధానమే ‘క్రయోనిక్స్’. గ్రీకు భాషలో “క్రయో” అంటే చలిని సూచిస్తుంది. అంటే శరీరాన్ని గాఢ శీతల వాతావరణంలో భద్రపరచి, భవిష్యత్తులో తిరిగి ప్రాణం పోయించాలనే ప్రయత్నం.
అమెరికన్ ఫిజిసిస్ట్ రాబర్ట్ ఎటింగర్ యాభై ఏళ్ల క్రితం ఈ ఆలోచనను మొదలు పెట్టారు. ఆయన తల్లి, భార్యల శరీరాలను కూడా ఇదే విధానంలో ఉంచారు. తర్వాత ఆయన శరీరమూ అదే ప్రాసెస్‌లో చేరింది. ప్రపంచంలో ఇప్పుడు అమెరికా, రష్యా, చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క్రయోనిక్స్ సెంటర్లు ఉన్నాయి.
క్రయోనిక్స్ ప్రక్రియ మూడు దశల్లో సాగుతుంది. ముందుగా మృతి ధృవీకరణతో పాటు కృత్రిమ శ్వాస, రక్త ప్రసరణ కొనసాగించి కణజాలం త్వరగా చనిపోకుండా కాపాడతారు. తర్వాత శరీరంలోని ద్రవాలను బయటకు తీసి ప్రత్యేక రసాయనాలు నింపుతారు. వీటివల్ల శరీరం గడ్డకట్టిపోకుండా గాజు లాంటి స్థితిలోకి మారుతుంది. చివరగా, -200° సెల్సియస్ వరకు చల్లబరచి లిక్విడ్ నైట్రోజన్‌తో నిండిన “క్రయోస్టాట్” లో దశాబ్దాల పాటు భద్రపరుస్తారు.
కానీ ఇది ఖరీదైన వ్యవహారం. అమెరికాలో పూర్తిస్థాయి శరీరాన్ని ఉంచాలంటే సుమారు రెండు కోట్లు, మెదడుని మాత్రమే భద్రపరచాలంటే దాదాపు ఎనభై లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే.. ఏదో ఒక రోజు శాస్త్రవేత్తలు కణజాలానికి జీవం పోయించే ఫార్ములా కనుక్కుంటారని, అప్పుడు ఈ “క్రయో పేషెంట్స్” మళ్లీ బతికి వస్తారని ఆశ.
ఇప్పటికే రష్యా, అమెరికా సెంటర్లలో వందలాది శరీరాలు ఈ శీతల నిద్రలో ఉన్నాయి. ప్రొఫెసర్ రే కుర్జ్‌వీల్, జెఫ్ బెజోస్ లాంటి ప్రముఖులు భవిష్యత్తులో మనిషి మరణాన్ని జయిస్తాడని నమ్ముతున్నారు. 3D బయోప్రింటింగ్, నానోమెడిసిన్ వంటి ఆవిష్కరణలతో మృతకణాలను మళ్లీ బతికించవచ్చని వైద్య ప్రపంచం విశ్వసిస్తోంది.
అయితే, ఒకసారి మళ్లీ బతికితే వారిని చట్టపరంగా ఎలా చూడాలి? కొత్త పుట్టినట్టు గుర్తించాలా, పాత జనన వివరాలే కొనసాగించాలా? సమాజం వారిని అంగీకరిస్తుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎదురు చూస్తున్నాయి. అయినా, శవాలకే కాకుండా పెంపుడు జంతువులకు కూడా ఈ ప్రయోగం పెరుగుతోంది. ఇప్పటికే వందలాది కుక్కలు, పిల్లులు క్రయోనిక్స్ లో భద్రంగా ఉన్నాయట. ఒక రకంగా ఈ ప్రక్రియ ప్రకృతికి విరుద్ధమే వారు కూడా ఉన్నారు. మరి మనిషి చావును జయిస్తాడో లేదో అనే ప్రశ్నకు కాలమే సమాధానం ఇవ్వాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates