అమెరికా విదేశాంగశాఖ తాజాగా నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు సంబంధించిన కఠిన నిబంధన అమలు చేసింది. ఇప్పుడు దరఖాస్తుదారులు తమ స్వదేశంలో లేదా లీగల్ రెసిడెన్సీ ఉన్న ప్రదేశంలోనే వీసా ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకోవాలి. ఇంతకుముందు ఉన్నట్లుగా విదేశీ దేశాల్లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకునే అవకాశం ఇక లేదు. ఈ మార్పు భారతీయులకు అనేక ఇబ్బందులను కలిగించే అవకాశం ఉంది.
ప్రస్తుతం భారత్‌లో వీసా ఇంటర్వ్యూలు పొందడానికి ఎక్కువ సమయం పడుతోంది. హైదరాబాద్, ముంబయి వంటి నగరాల్లో సుమారు 3-4 నెలలు, చెన్నైలో 9 నెలల వరకు వేచి చూడాలి. ఇంతవరకు విద్యార్థులు లేదా బిజినెస్ ట్రావెలర్స్ జర్మనీ, సింగపూర్, బ్యాంకాక్ వంటి దేశాల్లో త్వరగా ఇంటర్వ్యూలు బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో ఆలస్యం తప్పదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా విద్యార్థి వీసాల కోసం దరఖాస్తులు చేసే వారి సంఖ్య పెద్దది. కొత్త నిబంధనలతో అడ్మిషన్స్ డెడ్ లైన్ కు చేరుకోవడం కష్టంగా మారవచ్చు. ఇప్పటికే అపాయింట్‌మెంట్ ఆలస్యం కారణంగా కొంతమంది విద్యార్థులు కెనడా, యుకె, ఆస్ట్రేలియా వంటి ప్రత్యామ్నాయ దేశాలను ఎంచుకుంటున్నారు. బీ1 వీసాల ద్వారా అమెరికాకు వ్యాపార ప్రయాణాలు చేసే వారు తక్షణం వీసా పొందాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొత్త నిబంధనల వల్ల వారికీ కనీసం మూడు నుంచి నాలుగు నెలలు ఆలస్యం అవుతుంది. దీనివల్ల ఒప్పందాలు, సమావేశాలు, ప్రాజెక్టులు వాయిదా పడే అవకాశం ఉంది.
వీసా కోసం ఎక్కువకాలం వేచి ఉండాల్సి రావడంతో పాటు, మరోసారి ఇంటర్వ్యూలు రీషెడ్యూల్ చేయాల్సి వస్తే అదనపు ఖర్చులు తప్పవు. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారులు మళ్లీ ప్రయాణ టికెట్లు బుక్ చేయడం, వసతి ఖర్చులు భరించడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త నిబంధనల వల్ల అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఇతర దేశాల వైపు మొగ్గు చూపవచ్చు. వ్యాపార పరంగా కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపుతుంది. భారత్ అమెరికా మధ్య ఉన్న టెక్నాలజీ, ఐటీ రంగ అనుబంధాలు కూడా ఇలాంటి అడ్డంకుల వల్ల దెబ్బతినే ప్రమాదం ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates