భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతోంది. 2019లో బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.6,000 కోట్ల నిధి.. ఐదు సంవత్సరాల్లో మూడింతలు పెరిగి రూ.20,686 కోట్లకు చేరింది. క్రికెట్ ఆడకపోయినా, క్రికెట్ చుట్టూ తిరిగే వ్యాపారాలు బీసీసీఐని నెంబర్ వన్ స్థానంలో నిలబెడుతున్నాయి.
2023-24 ఆర్థిక సంవత్సరంలో బోర్డు 1,623 కోట్ల లాభం ఆర్జించింది. ఇది ముందు లాభం అయిన 1,167 కోట్లతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి వచ్చిన ఆదాయం, ఐసీసీ నుంచి లభించే పంపిణీలు, అలాగే పెట్టుబడులపై వచ్చిన రాబడులు బీసీసీఐ ఖజానా బరువు పెంచాయి. గత ఏడాదిలోనే రూ.4,193 కోట్ల అదనపు సంపాదన నమోదు కావడం గమనార్హం.
కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు, బీసీసీఐ సాధారణ నిధి కూడా దాదాపు రెండింతలు పెరిగింది. 2019లో 3,906 కోట్లు ఉండగా 2024 నాటికి 7,988 కోట్లకు చేరింది. అయితే, బోర్డు జాగ్రత్తలు కూడా తీసుకుంటోంది. 2023-24 సంవత్సరానికి మాత్రమే ఆదాయపన్ను బకాయిల కోసం 3,150 కోట్లను ప్రత్యేకంగా కేటాయించింది. కోర్టు కేసులు, ట్రైబ్యునల్‌లో జరుగుతున్న వాదోపవాదాల మధ్య కూడా ఈ నిధిని విడిగా ఉంచడం బీసీసీఐ ఆర్థిక శక్తిని చూపిస్తోంది.
అయితే మీడియా హక్కుల ఆదాయం మాత్రం తగ్గింది. 2022-23లో 2,524 కోట్లుగా ఉన్న ఈ మొత్తం, హోమ్ మ్యాచ్‌లు తక్కువగా ఉండటంతో 813 కోట్లకే పరిమితమైంది. కానీ పెట్టుబడులపై రాబడి 986 కోట్లకు పెరగడం ఆ లోటును కొంత భర్తీ చేసింది. మరోవైపు, రాష్ట్ర క్రికెట్ సంఘాలకు భారీగా నిధులు విడుదల చేసింది. గతేడాది మాత్రమే 1,990 కోట్లను కేటాయించగా, ఈ ఏడాది 2,013 కోట్ల పంపిణీ జరగనుంది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం 1,200 కోట్లు, ప్లాటినం జూబిలీ బెనివోలెంట్ ఫండ్ కోసం 350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి 500 కోట్లు కేటాయించడం బీసీసీఐ బలాన్ని చూపుతోంది. ఒకప్పుడు కేవలం ఆటను నడిపించే సంస్థగా ఉన్న బీసీసీఐ, ఇప్పుడు ఆర్థిక శక్తివంతమైన సామ్రాజ్యంలా మారింది. ఆటగాళ్లు, రాష్ట్ర సంఘాలు, అభిమానులు అందరికీ లాభపడేలా నిధులను వినియోగించడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates