స్పాన్సర్ రేసులో కఠిన నిబంధనలు.. బీసీసీఐ బిగ్ చెక్!

క్రికెట్ స్పాన్సర్‌షిప్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీమిండియా జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్‌11తో ఒప్పందం ముగిసిన నేపథ్యంలో, బీసీసీఐ కొత్త స్పాన్సర్ కోసం టెండర్లు ఆహ్వానించింది. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం, మద్యం, పొగాకు, ఆన్‌లైన్ బెట్టింగ్, గాంబ్లింగ్, క్రిప్టోకరెన్సీ, అశ్లీల కంటెంట్ మీడియా వంటి రంగాల్లో ఉన్న సంస్థలకు అవకాశం లేదు.

పబ్లిక్ మోరల్స్‌కి విరుద్ధంగా ఉన్న ఏదైనా బ్రాండ్‌ కూడా నిషేధిత జాబితాలోకి వెళ్ళినట్లే. ఇదే కాకుండా, డమ్మీ కంపెనీల పేరుతో లేదా సరోగేట్ బ్రాండింగ్‌ ద్వారా టెండర్ వేసినా అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది.

స్పాన్సర్‌గా రావాలంటే మూడు ఏళ్ల ఆడిట్ రిపోర్టుల ప్రకారం రూ.300 కోట్ల సగటు టర్నోవర్ లేదా రూ.300 కోట్ల నికర ఆస్తులు ఉండాలి. అంతేకాదు, నేర కేసుల్లో శిక్షార్హులుగా ఉండకూడదు, మోసాలు, ఆర్థిక అవకతవకలు ఉండకూడదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాబితాలో వడ్డీలు కట్టని పెద్ద డిఫాల్టర్‌గా ఉండకూడదు. కంపెనీకి ప్రతిష్ట, నమ్మకం ఉండాలి.

డ్రీమ్‌11తో బీసీసీఐ 2023లో మూడు సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. దాని విలువ రూ.358 కోట్లు. కానీ ఇటీవల పార్లమెంటులో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో ఆ సంబంధం ముగిసింది. దాంతో ఇప్పుడు కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం బోర్డుకు సవాల్ గా మారింది. ఆసియా కప్ సమీపిస్తోన్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి, బీసీసీఐ స్పాన్సర్‌షిప్‌పై కఠిన నియమాలు పెట్టింది. “క్రికెట్ దేశానికి గౌరవం తెచ్చే ఆట. కాబట్టి దానికి సంబంధించిన బ్రాండ్స్ కూడా ప్రజలు అంగీకరించేలా ఉండాలి” అన్న సంకేతం ఇచ్చింది. మరి నెక్స్ట్ టీమిండియా జెర్సీపైన మెరిసే బ్రాండ్ గా ఏది ఫైనల్ అవుతుందో చూడాలి.