అమెరికాలో కొత్త బిల్లు.. గ్రీన్‌కార్డ్‌ హోల్డర్లలో ఆందోళన

అమెరికాలో వలసదారులకు షాక్‌ ఇస్తున్న కొత్త బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ (DUI) కేసు ఉన్నా, అది ఏళ్ల క్రితం జరిగినదైనా, గ్రీన్‌కార్డ్‌ హోల్డర్లు లేదా వీసా కలిగిన వారిని డిపోర్ట్‌ చేసే అధికారం ఈ బిల్లుతో లభించనుంది. “Protect Our Communities from DUIs Act” అనే ఈ బిల్లు ఇప్పటికే హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఇది సెనేట్‌ వద్ద ఉంది.

వైట్‌హౌస్‌ కూడా ఈ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఒకసారి చట్టంగా మారితే, అమెరికాలో చదువుతున్న స్టూడెంట్లు, ఉద్యోగాలకు వచ్చిన వారు, గ్రీన్‌కార్డ్‌ హోల్డర్లు.. ఎవరైనా పాత DUI కేసుతో బయటకు పంపబడే పరిస్థితి వస్తుంది. న్యాయప్రక్రియ, రీహాబిలిటేషన్‌ అవకాశాలు లేకుండానే నేరుగా చర్య తీసుకోవడమే ఈ బిల్లులోని కఠిన అంశమని నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో వలస కమ్యూనిటీల్లో, ముఖ్యంగా భారతీయులలో ఆందోళన ఎక్కువగా ఉంది. ఎందుకంటే అమెరికాలో ఉన్నత విద్య కోసం, ఉద్యోగాల కోసం ఎక్కువమంది భారతీయులే వెళ్తారు. గ్రీన్‌కార్డ్‌ పొందిన వారిలో కూడా భారతీయులే అధికం. చిన్నతప్పిదంగా పరిగణించిన DUI కేసులు ఇప్పుడు జీవితాన్ని తారుమారు చేసే ముప్పు కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటివరకు చిన్న స్థాయి DUI కేసులకు ఆటోమేటిక్‌ డిపోర్టేషన్‌ ఉండేది కాదు. కానీ ఈ కొత్త బిల్లుతో పరిస్థితి మారిపోనుంది. ఎవరో ఒకరు తాము డ్రంక్ అండ్‌ డ్రైవ్‌ చేశామని అంగీకరించినా, అది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగినా, ఆ రికార్డు ఆధారంగా డిపోర్ట్‌ అవ్వొచ్చని చెబుతున్నారు.

ఇమిగ్రేషన్‌ యాక్టివిస్టులు, లాయర్లు చెబుతున్నది ఏమిటంటే.. ఈ బిల్లుతో డ్యూ ప్రాసెస్‌ పూర్తిగా మిస్సవుతుంది. హెచ్చరికలు లేకుండా, కోర్టు విచారణ లేకుండా, నేరుగా డిపోర్ట్‌ చేసే అవకాశం వస్తుంది. దీనివల్ల అమెరికాలో చట్టబద్ధంగా జీవిస్తున్న అనేక కుటుంబాలు విడిపోవాల్సిన పరిస్థితి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఒక్కసారి ఈ బిల్లు చట్టమైతే, అమెరికాలో ఉన్న లక్షలాది భారతీయుల భవిష్యత్తు సవాలుగా మారనుంది. చిన్న తప్పిదాలు కూడా జీవితాలను మార్చేసే స్థితి రానుందని ఆందోళన వ్యక్తమవుతోంది.