అమెరికాలోని రోడ్ ఐలాండ్‌కు చెందిన జడ్జి ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. ఆయన పాంక్రియాటిక్ క్యాన్సర్‌తో పోరాడుతూ చివరి వరకూ తన ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకున్నారు. కొన్ని వారాల క్రితమే “మీ ప్రార్థనలు నా మనసుకు బలం ఇస్తాయి” అంటూ అభిమానులను అభ్యర్థించిన ఆయన, చివరకు తన చివరి శ్వాస విడిచారు.
కోర్టులో న్యాయం చెబుతున్న తీరు వల్లే ఆయనను “ప్రపంచంలోనే ఓ మంచి జడ్జి” అని పిలిచేవారు. అతను చెప్పే తీర్పులు కేవలం చట్టపరంగానే కాకుండా కరుణ, మనస్ఫూర్తి, మానవత్వం కలిపి ఉండేవి. చిన్న చిన్న తప్పులు చేసిన పేద కుటుంబాలకు జరిమానాలు రద్దు చేయడం, చదువుకునే పిల్లలకు సాయం అందించడం వంటి తీర్పులు ఆయనను కోట్లాది మందికి ఆరాధ్యుడిని చేశాయి. ఆ తీర్పుల వీడియోలు సోషల్ మీడియాలలో కూడా వైరల్ అవుతూ బిలియన్ల వ్యూస్ సాధించాయి.
కాప్రియో పుట్టింది ప్రావిడెన్స్‌లో. దశాబ్దాల పాటు మునిసిపల్ కోర్టులో జడ్జిగా పనిచేశారు. ఆయన కోర్టును టెలివిజన్‌కు తీసుకొచ్చిన Caught in Providence షో 2018 నుంచి 2020 వరకు ప్రసారమై, అనేక ఎమి అవార్డులకు నామినేట్ అయింది. ఈ కార్యక్రమం ద్వారా న్యాయం అనేది కేవలం శిక్షించడం కాదు, కరుణతో కూడిన న్యాయం కూడా సాధ్యమేనని ఆయన ప్రపంచానికి నిరూపించారు.
2023లో తనకు పాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని కాప్రియో స్వయంగా ప్రకటించారు. చికిత్సలో భాగంగా కొన్నిసార్లు ఉత్సాహపరిచే దశలు ఉన్నా, చాలా కఠిన సమయాలు కూడా ఎదుర్కొన్నారు. ఆ సమయంలో తనను మరచిపోకుండా ప్రార్థనలు చేయమని అభిమానులను కోరిన ఆయన, చివరి వరకు ఆత్మవిశ్వాసంతోనే నిలబడ్డారు. వ్యక్తిగత జీవితంలో ఆయన ఆదర్శవంతుడే. ప్రేమమయమైన భర్తగా, తండ్రిగా, తాతగా తన కుటుంబానికి అండగా నిలిచారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates