దేశ పన్ను విధానంలో పెద్ద మార్పు రాబోతోంది. ప్రస్తుతం అమలులో ఉన్న 5%, 12%, 18%, 28% జీఎస్టీ రేట్లను తగ్గించి, కేవలం రెండు శ్లాబులకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీపావళి నాటికి ఈ మార్పులు అమల్లోకి రావచ్చని సూచనలు ఉన్నాయి. దీని ద్వారా సాధారణ ప్రజలు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలపై ఉన్న పన్ను భారం తగ్గి, వినియోగం పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోనే ఈ మార్పుల సంకేతాలు ఇచ్చారు. నిత్యవసర ఉత్పత్తులపై పన్ను తగ్గించి, పండుగ సీజన్‌లో ప్రజలకు ఊరట ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSME) ఇది ఊతమివ్వగలదని, వస్తువుల ధరలు తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అన్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త వ్యవస్థలో “స్టాండర్డ్ రేట్” “మెరిట్ రేట్” అనే రెండు శ్లాబులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు మాత్రమే విడి రేట్లు వర్తిస్తాయి. సాధారణ వినియోగ వస్తువులు తక్కువ రేటులోకి వస్తే, లగ్జరీ మరియు హై ఎండ్ ఉత్పత్తులు రెండవ శ్లాబులోకి వెళ్లే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న పన్ను నిర్మాణం పలు వ్యాపారులకు క్లిష్టంగా ఉందని, వినియోగదారులకు కూడా స్పష్టత లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. రెండు రేట్ల వ్యవస్థతో పన్ను లెక్కింపు సులభమవుతుంది, ఉత్పత్తి ధరలలో స్పష్టత వస్తుంది. దీని ద్వారా మార్కెట్‌లో పోటీ కూడా పెరిగి, వినియోగదారులకు తక్కువ ధరలకు వస్తువులు అందే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం అమలైతే, చిన్న వ్యాపారాల నుంచి పెద్ద పరిశ్రమల వరకు అందరికీ లాభం చేకూరవచ్చు. ముఖ్యంగా పండుగ సీజన్‌కి ముందు వస్తువుల ధరలు తగ్గితే, వినియోగం గణనీయంగా పెరిగి, ఆర్థిక చక్రం వేగంగా తిరిగే అవకాశం ఉంది. అయితే, చివరి నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తర్వాతే వెలువడుతుంది. ఈ మార్పులు వాస్తవంగా ఎంతవరకు ప్రభావం చూపుతాయో, వినియోగదారుల ఖర్చుల్లో ఎంత ఊరట ఇస్తాయో వచ్చే నెలల్లో తేలనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates