హైదరాబాద్ మహానగరం అంటే ప్రస్తుతం పెట్టుబడులకు గమ్యస్థానం. రియల్ ఎస్టేట్ రంగానికి పసిడి నగరం. అదేసమయంలో స్టార్టప్‌లు, మెట్రోలు ఇలా అనేక సంస్థలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఈ నగరాన్ని ప్రపంచ స్థాయికి చేర్చే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అయితే అలాంటి నగరంలో పట్టపగలు దోపిడీలు పెరిగిపోతున్నాయి. 24 గంటల కిందట శంషాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంటులో భారీ దోపిడీ జరిగింది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు కూడా విచారణ చేపట్టారు.
ఈ వ్యవహారంపై ఇంకా కోలుకోకముందే తాజాగా చందానగర్‌లోని ప్రఖ్యాత ఖజానా జ్యువలరీ షోరూంలో దోపిడీకి ప్రయత్నించడం, ఈ క్రమంలో దుండగులు కాల్పులకు సైతం తెగబడడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఖజానా జ్యువలరీ సిబ్బంది దైనందిన వ్యాపార కార్యక్రమాలకు రెడీ అవుతున్నారు. ఈ సమయంలో వినియోగదారుల మాదిరిగా లోనికి ప్రవేశించిన దుండగులు ప్రధాన లాకర్ తాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దీనికి సిబ్బంది నో చెప్పడంతో వెంటనే కాల్పులకు తెగబడ్డారు. ఆకస్మిక పరిణామంతో విస్తుబోయిన ఉద్యోగులు ప్రాణాలు గుప్పిటపట్టి తలోదిక్కుకూ పరుగులు పెట్టారు. ఇంతలో మేనేజర్‌పై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన తప్పించుకునే క్రమంలో తొడలోకి తూటా దూసుకుపోయింది. మరోవైపు సీసీ కెమెరాలను కూడా దుండగులు కాల్చేశారు. ఈ కాల్పుల మోత బయటకు వినిపించగానే అద్దాల కేసుల్లో ఉన్న బంగారు ఆభరణాలను సంచుల్లో వేసుకున్నారు.
ఇంతలో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. పరుగు పరుగున షోరూం వద్దకు చేరుకునే సరికి దుండగులు సినీ ఫక్కీలో వారి నుంచి తప్పించుకున్నారు. మొత్తం ఆరు గురు దుండగులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలపై కాల్పులు జరిపినా రికార్డు అయ్యిందన్నారు. దీని ప్రకారం విచారణ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుంటే ఈ పరిణామంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటి వరకు జ్యువలరీ షాపుల వద్ద ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడం, ఇప్పుడు ఏకంగా కాల్పులకు తెగబడడంతో ప్రజలు భీతిల్లే పరిస్థితి ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates