ట్రంప్ టారిఫ్ షాక్: భారత్ పై ఎఫెక్ట్ ఎంత ఉండవచ్చు?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌పై టారిఫ్‌లు విధించిన తీరు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించడాన్ని కారణంగా చూపిస్తూ భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు (సుంకాలు) విధించారు. దీంతో భారత ఉత్పత్తులపై అమెరికాలో ధరలు పెరగడం, ఎగుమతులు మందగించడానికి కారణమవుతుంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ చర్యలను అన్యాయమని అభివర్ణిస్తూ, జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఎఫెక్ట్ ఏ స్థాయిలో..

అమెరికా భారత్ ఎగుమతుల్లో షేర్ పెద్దది కాకపోయినా, ముఖ్యమైన కొన్ని రంగాలు మాత్రం గట్టిగా దెబ్బతినే అవకాశముంది. ప్రత్యేకంగా డైమండ్స్, జ్యువెలరీ, టెక్స్‌టైల్స్, అప్పారెల్స్, కెమికల్స్ రంగాలు అమెరికా మార్కెట్‌పై ఆధారపడి ఉన్నాయి. UBS లెక్కల ప్రకారం దాదాపు $8 బిలియన్ డాలర్ల విలువైన ఇండియన్ ఎగుమతులు ఈ కొత్త టారిఫ్‌ల వల్ల ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. వీటిలో ప్రధానంగా రత్నాలు, నగలు, వస్ర్తాలు, కెమికల్స్ ఉన్నాయి.

ఇక స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన విషయానికి వస్తే.. నిఫ్టీ 50 ఇండెక్స్‌లో అమెరికా డైరెక్ట్ ఎక్స్‌పోజర్ 9% మాత్రమే ఉండగా, అవి కూడా మెజారిటీగా ఐటీ సర్వీసెస్‌లోనే ఉన్నాయి. ఐటీ రంగంపై ప్రస్తుత టారిఫ్‌ల ప్రభావం లేదు. అదే విధంగా, ఫార్మాస్యూటికల్ ఎగుమతులు, సెమికండక్టర్లు, అల్యూమినియం, స్టీల్ రంగాలపై కూడా ఈ టారిఫ్‌లు ప్రభావం చూపకపోవచ్చు. ఇందువల్ల భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద కాకుండా, కొన్ని ఎగుమతి రంగాల మీద మాత్రమే ప్రధానంగా నష్టాలు పడేలా ఉన్నాయి.

అయినా, రత్నాలు, వస్ర్తాలు, కెమికల్స్ వంటి రంగాలకు ఇది భారీ పోటీ లోటును కలిగించనుంది. వ్యాపారాలు వేరే మార్కెట్లను వెతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది. సరుకుల ధరలు పెరగడం, ఆర్డర్లు తగ్గిపోవడం, ఉద్యోగాల్లో కోతలు వంటి ముప్పులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం టార్గెట్ అయిన రంగాలకు ప్రత్యేక సహాయ ప్యాకేజీలు ప్రకటించే అవకాశముంది.

మొత్తానికి, ట్రంప్ టారిఫ్‌ల వల్ల భారతీయం జ్యువెలరీ, టెక్స్‌టైల్స్‌, కెమికల్స్ రంగాలు తాత్కాలికంగా నష్టాలు చవిచూడవచ్చు. అయితే, ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ రంగాలకు పెద్దగా ప్రభావం లేకపోవడంతో మార్కెట్‌లో పెద్ద దెబ్బ మాత్రం తగలకపోవచ్చు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా స్పందిస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చు.