ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ బాంకే బిహారీ ఆలయానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలయ నిధుల నుంచి రూ.500 కోట్లు తీసుకొని కారిడార్ నిర్మించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వివాదానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. “లార్డ్ కృష్ణుడే మొదటి మధ్యవర్తి. కాబట్టి మీరు కూడా మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్య పరిష్కరించుకోవాలి,” అంటూ సూచించింది.
1862లో నిర్మించిన ఈ బాంకే బిహారీ ఆలయం ఉత్తర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. గతేడాది జన్మాష్టమి సందర్భంగా ఆలయంలో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పించేందుకు యూపీ ప్రభుత్వం కారిడార్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఆలయం నిర్వహణ బాధ్యతలు చూసే కుటుంబాన్ని తొలగించి, నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణను తీసుకోవడం వివాదానికి దారితీసింది.
ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు వేసింది. ఆలయానికి సంబంధించిన వివాదంలో ప్రభుత్వం నేరుగా ప్రవేశించడం సరికాదని పేర్కొంది. ‘‘ఇది రెండు ప్రైవేట్ పార్టీల మధ్య వివాదం. ప్రభుత్వం ఇలాంటి వివాదాల్లోకి ప్రవేశించడం న్యాయపరంగా సరైన విధానం కాదు,’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా కోర్టు నుంచి అనుమతి పొందడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనికి పరిష్కారంగా, ఆలయ నిర్వహణ బాధ్యతలను ఒక తాత్కాలిక కమిటీకి అప్పగించాలని న్యాయస్థానం ప్రతిపాదించింది. సుప్రీంకోర్టు ఒక మంచి ఉదాహరణ కూడా ఇచ్చింది. “కృష్ణుడు చరిత్రలో మొదటి మధ్యవర్తి (Mediator)!” అని చెప్పారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు, కౌరవులు పాండవుల మధ్య శాంతి కాపాడేందుకు “మధ్యవర్తిగా” చర్చలు జరిపాడు. ఇక “ఈ ఆలయ వివాదంలో కూడా, మీరు కోపంగా ఉండకుండా… ఇరు వర్గాలు (ప్రభుత్వం, ఆలయ కుటుంబం) చర్చలు జరిపి, కృష్ణుడిలా మధ్యవర్తిత్వంతో పరిష్కారం కనుక్కోవాలి,” అన్నట్లుగా సుప్రీంకోర్టు సూచించింది.
ఈ కమిటీలో రిటైర్డ్ న్యాయమూర్తులు ఉండాలని, ఆలయ సంప్రదాయ పూజా విధానాలు మాత్రం ఇప్పటివరకూ నిర్వహించిన కుటుంబానికే కొనసాగించాలని తెలిపింది. ఇలా చేస్తే వివాదం తాత్కాలికంగా సమసిపోతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కారిడార్ నిర్మాణం కోసం అవసరమైన భూములను ప్రభుత్వం చట్టప్రకారం స్వాధీనం చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది కోర్టు. దీనిపై ప్రభుత్వం స్పందన తెలపాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. ఇలాంటి చర్యలతో భక్తులకు సురక్షితమైన దర్శనం కల్పిస్తూ, ఆలయ సంప్రదాయాలనూ కాపాడుకోవచ్చని న్యాయస్థానం అభిప్రాయపడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates