ఇండియన్ క్రికెట్లో ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలి. ఘోర పరాజయం తప్పదనుకున్న మ్యాచ్‌లో అద్భుత పోరాటంతో డ్రాతో గట్టెక్కింది టీమ్ ఇండియా. ప్రత్యర్థి జట్టుకు 300కు పైగా ఆధిక్యం సమర్పించుుకని.. ఐదు సెషన్లకు పైగా ఆట మిగిలి ఉండగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టి, ఒక్క పరుగూ చేయకముందే రెండు వికెట్లు కోల్పోయిన జట్టు మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తుందని ఎవ్వరూ ఊహించరు. కానీ కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ల అసాధారణ పోరాటంతో భారత జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. మ్యాచ్‌ను డ్రా చేసుకుని సగర్వంగా నిలబడింది.
ఐతే భారత జట్టును చుట్టేయడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైన ఇంగ్లాండ్ జట్టు.. ఆ అసహనంలో మ్యాచ్ చివర్లో ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. స్టోక్స్, అతడి సహచరులు.. జడేజా, సుందర్‌లతో వ్యవహరించిన తీరును ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లే తప్పుబడుతున్నారు. మ్యాచ్‌లో మాండేటరీ ఓవర్లు (చివరి 15) మొదలు కావడానికి ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్.. జడేజా, సుందర్‌లతో డ్రా కోసం చేతులు కలపడానికి ప్రయత్నించాడు. కానీ మన వాళ్లు డ్రాకు అంగీకరించలేదు. అప్పటికి జడేజా స్కోరు 89 కాగా, సుందర్ 80 పరుగులు చేశాడు. కాసేపు ఆడితే ఇద్దరూ సెంచరీలు పూర్తి చేస్తారు. వాళ్లు అప్పటిదాకా పడ్డ కష్టానికి శతకాలతో ముగించాలని కోరుకోవడంలో తప్పు లేదు.
కానీ అదేదో పెద్ద తప్పు అన్నట్లుగా స్టోక్స్ అండ్ కో చాలా అతి చేశారు. బ్యాటర్లయిన బ్రూక్, డకెట్‌లతో బౌలింగ్ చేయించాలా.. సెంచరీ చేసుకుంటావా అంటూ జడేజాతో వెటకారంగా మాట్లాడాడు స్టోక్స్. మిగతా ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా ఆ సమయంలో చేసిన ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. మనవాళ్లకు ఏదో సెంచరీల పిచ్చి ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది ఇంగ్లిష్ జట్టు. మనవాళ్లు డ్రాకు నిరాకరించాక స్టోక్స్ కావాలనే బ్రూక్‌తో బౌలింగ్ చేయించి మన వాళ్లను తేలిక చేయడానికి చూశాడు. ఇలా చేయడాన్ని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ సైతం తప్పుబట్టాడు.
వాళ్లు డ్రా ఆఫర్ చేయగానే మనవాళ్లు ఒప్పేసుకోవాలట. ఒకవేళ ఇంకో పది ఓవర్ల ముందు మనవాళ్లు డ్రా కోసం ప్రతిపాదిస్తే వాళ్లు ఒప్పుకునేవాళ్లా? ఇక మ్యాచ్ గెలిచే అవకాశం లేదని తెలియగానే డ్రాకు ప్రపోజల్ పెట్టారు. ఐతే ఇంగ్లాండ్ ఆటగాళ్లు అంత అతి చేసినా.. జడేజా, సుందర్ తొణకలేదు. హుందాగా వ్యవహరించారు. ఇద్దరూ సెంచరీలు పూర్తి చేసుకుని, అప్పుడు డ్రాకు ఒప్పుకుని సగర్వంగా మైదానాన్ని వీడారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇంగ్లాండ్ ఆటగాళ్ల బలుపు స్పష్టంగా బయటపడింది. అందుకే క్రికెట్ ప్రపంచమంతా వాళ్ల మీద విమర్శలు గుప్పిస్తోంది. ఇండియన్స్ అయితే సోషల్ మీడియాలో స్టోక్స్ అండ్ కోను ఏకిపడేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates