దేశంలో అత్యధికంగా కాఫీ, టీలు విక్రయించే, వినియోగించే వారి జాబితాలో కర్ణాటక తొలిస్థానంలో ఉంది. ఇది జాతీయ గణాంకాలు చెబుతున్న లెక్క. రెండోస్థానంలో రాజస్థాన్ ఉండగా.. మూడో స్థానంలో పంజాబ్, నాలుగులో ఏపీ ఉన్నాయి. అయితే.. తాజాగా కర్ణాటకలోని అన్ని ప్రముఖ టీ, కాఫీ విక్రయాలు జరిపే.. హోటళ్లు, క్యాంటీన్లు.. వాటి విక్రయాలను నిలిపివేశాయి. ఈ మేరకు బోర్డులు కూడా పెట్టాయి. ఇక, ఆయా హోటళ్లు, కేఫ్‌లలో బ్లాక్ టీ మాత్రమే విక్రయిస్తున్నారు. అది కూడా నిరసనగా మాత్రమేనని కొందరు వ్యాపారులు తెలిపారు. దీనికి తోడు.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి నగదు లావాదేవీలను కూడా ఆయా హోటళ్లు నిలిపివేశాయి.
దీనికి కారణం.. కాఫీ, టీ విక్రయాలపై కేంద్రం జీఎస్టీ బాదేస్తోంది. గత ఏడాది 12 శాతం ఉన్న జీఎస్టీ వసూళ్లను ఈ ఏడాది 18 శాతానికి పెంచారు. ఇది విక్రయదారులకు, హోటళ్ల యజమానులకు తీవ్ర సంకటంగా మారింది. మరోవైపు.. నగదు లావాదేవీ లకు సంబంధించి ఆదాయ పన్ను అధికారులు, జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు రావడాన్ని విక్రయదారులు తీవ్రంగా తప్పుబట్టారు. జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకొని నోటీసులు పంపిస్తున్నాని.. పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే విక్రయాలు నిలిపివేస్తున్నామని వ్యాపారులు తెలిపారు.
అధికారుల వాదన ఇదీ..
జీఎస్టీ అధికారులు ఈ వివాదంపై స్పందించారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన డిజిటల్ లావాదేవీల ఆధారంగానే నోటీసులు ఇస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జీఎస్టీకి సంబంధించిన వివాదం కాదన్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు రూ.20 లక్షలు, రూ.40 లక్షలు దాటిన వ్యాపారులకు మాత్రమే నోటీసులు ఇస్తున్నామన్నారు. చాలా మంది జీఎస్టీ ఎగవేస్తున్నారని వారు చెప్పారు. గత నాలుగేళ్లలో కోట్ల రూపాయల మేరకు టీ, కాఫీ విక్రయాలపై లావాదేవీలు జరిగాయని… కానీ.. జీఎస్టీ చెల్లింపులు రాలేదని వారు చెబుతున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ వ్యాపారులకు ఉందని పేర్కొన్నారు.
రంగంలోకి సీఎం..
ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేరుగా రంగంలోకి దిగారు. కేంద్రంపై జీఎస్టీ విషయంలో పోరాడుతున్న నేపథ్యంలో ఆయనే నేరుగా జోక్యం చేసుకోవడం.. హుటాహుటిన స్పందించడం గమనార్హం. వ్యాపార వర్గాలతో ఆయన భేటీ అయ్యారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అయితే.. జీఎస్టీ వసూళ్ల విషయంలో వాస్తవాలు తెలుసుకునేందుకు ఆర్థిక నిపుణులతో ఒక కమిటీ నియమించనున్నట్టు చెప్పారు. వ్యాపారాలు సజావుగా సాగాలని.. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన వివరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates