గత ఏడాది ఐపీఎల్‌తో వెలుగులోకి వచ్చిన తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి.. చాలా వేగంగా స్టార్ ఆటగాడైపోయాడు. ఐపీఎల్‌లో మెరిసిన కొన్ని నెలలకే భారత జట్టులో చోటు దక్కించుకుని సత్తా చాటిన అతను.. గత ఏడాది చివర్లో ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కావడం.. అక్కడ ఓ టెస్టులో సూపర్ సెంచరీ సాధించి సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలతో ప్రశంసలు అందుకోవడం తెలిసిందే. తాజాగా ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కూ ఎంపికై రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం దక్కించుకున్న ఈ ఆల్‌రౌండర్.. అర్ధంతరంగా ఆ పర్యటన నుంచి ఇంటిముఖం పడుతున్నాడు.
నితీష్ ఏమీ మ్యాచ్ ఆడుతూ గాయపడలేదు. ఆదివారం జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా అతడికి గాయమైందట. లిగమెంట్ దెబ్బ తినడంతో నితీష్ పర్యటనలో కొనసాగలేని పరిస్థితి తలెత్తింది. మిగతా రెండు మ్యాచ్‌లకు అతను దూరమయ్యాడు. వెంటనే ఇండియాకు విమానం ఎక్కబోతున్నాడు నితీష్. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టుకు తుది జట్టులో అవకాశం దక్కించుకోలేకపోయిన నితీష్ కుమార్.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. రెండు టెస్టుల్లో కలిపి 45 పరుగులు చేసిన అతను.. 3 వికెట్లు తీశాడు.
మూడో టెస్టులో జడేజాతో కలిసి జట్టును గెలిపించడానికి అతను ప్రయత్నించాడు. కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. కానీ తర్వాత ఔటైపోయాడు. ఈ పర్యటన నితీష్‌కు చేదు అనుభవం అనే చెప్పాలి. అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయాడు. ఇప్పుడు అనూహ్యంగా జట్టుకు దూరం అయ్యాడు. ఇప్పటికే జట్టులో ఫాస్ట్ బౌలర్లు ఆకాష్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో నితిన్ సేవలు జట్టుకు ఎంతో అవసరం. కానీ అతను జిమ్ చేస్తూ గాయపడి ఇంటిముఖం పడుతున్నాడు. మరి అతను కోలుకుని తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates