భార్యకు భరణం చెల్లించలేక దొంగతనం

నెలకు రూ.6,000 భార్యకు భరణం చెల్లించలేక, ఓ వ్యక్తి చివరకు గొలుసు దొంగగా మారిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెలుగు చూసింది. నాగ్‌పూర్ నగరానికి చెందిన కన్హయ్య నారాయణ్ బౌరాషి అనే నిరుద్యోగి, కోర్టు ఆదేశాల మేరకు మాజీ భార్యకు ప్రతినెలా భరణం చెల్లించాల్సి ఉండగా, ఆ డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఫిబ్రవరి 22న నాగ్‌పూర్‌లోని మనీష్‌నగర్ ప్రాంతంలో నివసించే 74 ఏళ్ల జయశ్రీ జయకుమార్ గాడే అనే వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన వ్యక్తి లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక ఇంటెలిజెన్స్, సీసీటీవీ ఫుటేజీ సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో నిందితుడిగా కన్హయ్య నారాయణ్ బౌరాషి పేరు బయటకు వచ్చింది.

పోలీసులు కన్హయ్యను అదుపులోకి తీసుకొని విచారించగా, అతడు నేరాన్ని అంగీకరించాడు. అంతేకాదు గతంలో కనీసం నాలుగు ఇలాంటి గొలుసు దొంగతనాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది. అతడి వివరణ ప్రకారం, మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అనంతరం నెలకు రూ.6,000 భరణం చెల్లించమని కోర్టు ఆదేశించింది. కానీ రెండేళ్లుగా అతడు నిరుద్యోగిగా ఉండడంతో ఆ భరణం చెల్లించలేక తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. కోవిడ్ సమయంలో అతడు రెండో వివాహం కూడా చేసుకున్నాడు. దాంతో ఆర్థిక పరిస్థితులు మరింత దారుణంగా మారాయి.

కన్హయ్య దొంగిలించిన బంగారు ఆభరణాలను నగరంలోని “శ్రీ సాయి జ్యూయలర్స్” యజమాని అమర్‌దీప్ కృష్ణారావు నఖాటే అనే వ్యక్తికి విక్రయించినట్లు కూడా విచారణలో బయటపడింది. వెంటనే పోలీసులు ఆ జువెలరీ షాప్ యజమానిని కూడా అరెస్టు చేసి, అతడి నుంచి దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ మరియు సుమారు రూ.1.85 లక్షల విలువైన 10 గ్రాముల బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులను పోలీసులు కస్టడీలో ఉంచి మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.