మిడిల్ ఈస్ట్ దేశాలలో హత్య వంటి నేరాలకు శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ క్రమంలోనే యెమెన్ లో ఓ యెమెన్ జాతీయుడిని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియకు అక్కడి న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. జులై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ఆమెను కాపాడేందుకు బ్లడ్ మనీ రూపంలో ఆమె కుటుంబం చేసిన ప్రయత్నాలు దాదాపుగా విఫలమయ్యాయి. నిమిషకు ఉరిశిక్ష రద్దు చేయాలని యావత్ భారత దేశం కోరుకుంటోంది.
కొందరు ముస్లిం మత పెద్దలు, కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు నిమిష ఉరి ఆపేందుకు ఈ రోజు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలిస్తాయి అన్న గ్యారెంటీ లేదు. దీంతో, ఆమెకు ఉరి తప్పదని అంతా భావించారు. అయితే, అనూహ్యంగా నిమిష ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది.
మత పెద్దలతోపాటు పాటు భారత విదేశాంగ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలతో ఆమె ఉరి శిక్ష వాయిదా పడింది. యెమెన్ లో నిమిషను ఉరి తీయబోతున్న జైలు అధికారులతో భారత విదేశాంగ అధికారులు జరుపుతున్న చర్చలు సఫలమయ్యేలా కనిపిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వంతో భారత ప్రభుత్వం మరిన్న చర్చలు జరిపి నిమిష ఉరిశిక్ష రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
యెమెన్‌లో 2017లో తన వ్యాపార భాగస్వామి అయిన తలాల్ అబ్దో మహ్దీని హత్య చేశారని నిమిషా ప్రియపై ఆరోపణలు వచ్చాయి. దీంతో, విచారణ జరిపిన తర్వాత నిమిషకు మరణ శిక్ష విధించింది యెమెన్ న్యాయస్థానం. బ్లడ్ మనీ చెల్లించడం…అంటే మృతుడి కుటుంబానికి దాదాపు 7 కోట్ల రూపాయలు చెల్లించడం ద్వారా నిమిష ఉరి శిక్ష ఆపే చాన్స్ ఉంది. కానీ, యెమెన్‌లోని సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అది సాధ్యపడలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates