సిగాచీ విషాదం.. ఇది అన్నింటికంటే ఘోరం

హైదరాబాద్ శివార్లలోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతి అయ్యారు. అందులో ఇప్పటిదాకా 44 మృతదేహాలను అధికారులు గుర్తించారు.

ఆ మృతదేహాలు ఏవీ కూడా ఒక ఆకారంతో ఉన్నవి, గుర్తు పట్టేవి కావు. ఎముకలు కూడా బూడిదైపోయి.. చిన్న చిన్న ఆనవాళ్లు దొరికితే వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కడసారి చూసుకోవడానికి ఒక రూపం కూడా లేకపోవడం వారి కుటుంబ సభ్యులకు ఎంత వేదన కలిగిస్తుందో చెప్పాల్సిన పని లేదు.

ఇదే ఘోరం అంటే.. ఇంకొందరి విషయంలో ఆ మాత్రం ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. చిన్న చిన్న ఎముక ముక్కలు సైతం దొరక్కుండా చనిపోయిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నట్లు తేలింది. ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారం రోజులుగా తమ వారి ఆచూకీ కోసం పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నారు. అధికారులను కలుస్తున్నారు. కానీ వారి ఆనవాళ్లను గుర్తించే అవకకాశమే లేకపోయింది. వారానికి పైగా అన్ని అవశేషాలనూ సేకరించి పరీక్షలు జరిపినా.. కుటుంబ సభ్యుల డీఎన్ఏలతో మ్యాచ్ అయ్యేవి ఏవీ దొరకలేదు.

రాహుల్, శివాజీ, వెంకటేష్, వి.జయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ అనే ఆ ఎనిమిది మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్లే అని నిర్ధరించిన అధికారులు.. వారి అవశేషాలను గుర్తించడానికి మరింత సమయం కావాలని.. మూడు నెలల తర్వాత రావాలని వారి కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. వీరు చనిపోయినట్లు భావించి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని చెప్పేశారు. కడసారి చూపుకి నోచుకోకపోవడమే బాధ అంటే.. మృతదేహానికి సంబంధించిన చిన్న అవశేషం లేకుండా ఇప్పుడు అంత్యక్రియలు జరుపుకోవాల్సి రావడం అంటే అంతకంటే విషాదం మరొకటి ఉండదు. వారి బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.