ఇప్పటి వరకూ టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డర్, ట్రైన్ స్టేటస్ వంటి ఎన్నో రైలు సంబంధిత సేవలకు వేర్వేరు యాప్‌లు వాడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి స్వస్తి పలుకుతూ భారత రైల్వేలు సరికొత్త ‘రైల్ వన్’ అనే సూపర్ యాప్‌ను రిలీజ్ చేసింది. ఈ యాప్ ఒకే చోట రైలు ప్రయాణికుల అవసరాలన్నీ తీరేలా డిజైన్ చేయబడింది. కొత్త యాప్ ద్వారా రిజర్వ్డ్, అన్‌రిజర్వ్డ్, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్ చేయొచ్చు. అలాగే పీఎన్ఆర్ స్టేటస్, ట్రైన్ లొకేషన్, కోచ్ పొజిషన్, రైల్ మాదద్ ఫీడ్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ యాప్ డిజైన్ చాలా సరళంగా ఉండటంతో, కొత్తవారికీ సులువుగా ఉపయోగించుకునేలా ఉంటుంది. ‘సింగిల్ సైన్ ఆన్’ సదుపాయం ఉండటం వలన వేర్వేరు యాప్‌లకు వేర్వేరు పాస్‌వర్డ్‌లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే ఉన్న RailConnect లేదా UTS యాప్‌ల యూజర్ ఐడీతో సైన్ ఇన్ చేయొచ్చు. అదనంగా R-Wallet సదుపాయం కూడా ఇందులో ఉంటుంది. ఇది రైల్వేకు సంబంధించిన డిజిటల్ వాలెట్‌గా పని చేస్తుంది.
గెస్ట్ యాక్సెస్ కూడా అందుబాటులో ఉండటం వలన నేరుగా ఓటీపీ ద్వారా కూడా కొన్ని సేవలు వినియోగించుకోవచ్చు. అంటే ప్రతి చిన్న అవసరానికి కొత్త యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం ఇకపై ఉండదు. ప్రస్తుతం టికెట్ బుకింగ్ కోసం రైల్ కనెక్ట్ , ఫుడ్ కోసం eCatering, ఫిర్యాదు కోసం Rail Madad, అన్‌రిజర్వ్డ్ టికెట్లు కొనేందుకు UTS, ట్రైన్ ట్రాకింగ్ కోసం NTES వాడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఒక్క యాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి.
ఇకపోతే, రైల్వేలు బుకింగ్ సిస్టమ్‌లో మూడు పెద్ద మార్పులు కూడా తీసుకురానుంది. మొదటిది: టికెట్ చార్ట్‌ను ఇప్పటివరకు ట్రైన్ బయలుదేరే ముందు 4 గంటల ముందు రెడీ చేస్తారు. కానీ త్వరలో 8 గంటల ముందు చార్ట్‌ను తయారు చేస్తారు. ఉదయం 2 గంటల ముందే బయలుదేరే రైళ్లకు మాత్రం మునుపటి రోజు రాత్రి 9 గంటలకే చార్ట్ ఫిక్స్ చేస్తారు.
రెండో మార్పు తత్కాల్ బుకింగ్‌కు సంబంధించినది. జూలై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేయాలంటే తప్పనిసరిగా యూజర్ వేరిఫికేషన్ ఉండాలి. ఆధార్ లేదా డిజిలాకర్ ఆధారంగా వేరిఫికేషన్ పూర్తి చేయాలి. చివరి మార్పు డిసెంబర్ 2025లో అమలయ్యే రిజర్వేషన్ సిస్టమ్ అప్‌గ్రేడ్. ఇందులో బుకింగ్ సామర్థ్యం 10 రెట్లు పెరిగి, నిమిషానికి 1.5 లక్షల టికెట్లను ప్రాసెస్ చేయగలదు. 4 మిలియన్ ఇక్వైరీలకు ఒకేసారి స్పందించే సామర్థ్యం ఉంటుంది. ఇందులో ప్రత్యేకంగా దివ్యాంగులు, విద్యార్థులు, రోగుల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయి. మొత్తంగా చెప్పాలంటే, ఈ కొత్త యాప్ రైల్వే ప్రయాణికులకు టెక్నాలజీ పరంగా గేమ్ ఛేంజర్ అవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates