కొన్ని వారాల కిందట మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రఘువంశీ అనే కొత్త పెళ్లికొడుకు మేఘాలయాలో హనీమూన్ కోసం వెళ్లి హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. స్వయంగా భార్య సోనమ్‌యే తన ప్రియుడి సపోర్ట్ తీసుకుని సుపారీ కిల్లర్లను పెట్టి తన భర్తను చంపించడం కలకలం సృష్టించింది. తాజాగా తెలంగాణలోని గద్వాల జిల్లాలోనూ తేజేశ్వర్ అనే సర్వేయర్‌ను అతడి భార్య ఇదే రీతిలో చంపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి తరుణంలో ఇదే తరహాలో మరో కొత్త పెళ్లికొడుకు ప్రమాదంలో పడి.. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డ ఉదంతం ఉత్తర్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
ఆ రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి, సితార అనే యువతితో ఇటీవల వివాహం జరగగా.. ఫస్ట్ నైట్ సందర్భంగా భర్త తనను దగ్గరికి తీసుకోబోతే.. తనను ముట్టుకుంటే కత్తితో ముక్కలుగా నరుకుతానని బెదిరించిందట భార్య. ఆ సందర్భంగానే తన ప్రేమ వ్యవహారం గురించి చెప్పిందట. వరసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని తాను ప్రేమించానని, తనతోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆమె బెదిరించిందట. మూడు రోజులు తన ఇంట్లో ఉండి, ఒక రోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో సితార పారిపోయిందని నిషాద్ ఒక వీడియో ద్వారా వెల్లడించాడు. సితార తనను కేదార్‌నాథ్ యాత్రకు తీసుకెళ్లమని అడిగిందని, ఇటీవల జరిగిన రాజారఘువంశి హత్య గుర్తొచ్చి ఆగిపోయాయని నిషాద్ తెలిపాడు.
సితార తనతో ఉండగా.. ఎక్కడ తనను చంపేస్తుందో అని సరిగా నిద్ర కూడా పోలేదని.. పెళ్లి అనే మాట వింటేనే గుండెల్లో దడ పుడుతోందని అతను వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారం తెలిసిన వాళ్లంతా నిషాద్ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడని.. లేదంటే రాజా రఘువంశీ, తేజేశ్వర్ తరహాలోనే మరో హత్య జరిగేదని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు తరచుగా జరుగుతుండడంతో పెళ్లి అంటేనే కుర్రాళ్లు భయపడే పరిస్థితి తలెత్తుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates