41 ఏళ్ల అనంతరం మరోసారి భారత్ తరఫున వ్యోమగామి రోదసిలోకి పయనించడం గర్వకారణమైన ఘట్టం. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం ఫాల్కన్-9 రాకెట్ ద్వారా రోదసికి వెళ్లారు. భారత కాలమానం ప్రకారం 12:01కు లాంచ్ అయిన ఈ ప్రయోగంలో శుభాంశు తో పాటు హంగేరీ, పోలాండ్‌కు చెందిన వ్యోమగాములు పాల్గొన్నారు.
ఫ్రాన్స్, యూరప్, అమెరికా, భారత అంతరిక్ష సంస్థలు భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఈ మిషన్‌పై ప్రపంచం దృష్టిసారించింది. ఇప్పటికే తొలితర వ్యోమగామిగా రాకేశ్ శర్మ పేరు చరిత్రలో నిలిచిపోయింది. ఆయన తర్వాత అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వరకు చేరనున్న తొలి భారతీయుడిగా కూడా ఆయన గుర్తింపు పొందనున్నారు.
మిషన్ ప్రారంభానికి ముందు శుభాంశు తనకు అత్యంత ఇష్టమైన హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ సినిమాలోని ‘వందే మాతరం’ పాటను వింటూ భావోద్వేగానికి గురయ్యారు. లాంచ్ అయిన కొద్దిసేపటికే శుభాంశు రాకెట్‌లో నుంచే దేశ ప్రజలతో మాట్లాడారు. “41 ఏళ్ల తర్వాత మనం మళ్లీ రోదసిలోకి వచ్చాం. ఇది కేవలం ప్రయాణం కాదు. భారత మానవ అంతరిక్ష ప్రయోగాలకు బలమైన పునాది కూడా. నా పయనం ఐఎస్ఎస్‌కే కాదు.. భారత్ అంతరిక్ష దిశగా చేసే ప్రయోగాలకు మార్గదర్శకంగా నిలవాలి” అంటూ గర్వంగా చెప్పారు. భూమిని సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో చుట్టేస్తున్నామని వివరించారు.
శుభాంశు ప్రయోగాన్ని తల్లిదండ్రులు ప్రత్యక్షంగా లఖ్‌నవూ నుంచి వీక్షించారు. తమ కుమారుడు అంతరిక్షంలోకి వెళ్తున్నట్టు చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇది దేవుని దయతోనే సాధ్యమైందని తండ్రి శంభుదయాల్ శుక్లా చెప్పారు. మిషన్ విజయవంతంగా సాగుతుందన్న నమ్మకంతో కుటుంబసభ్యులు స్వీట్స్ పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. చివరికి మే 12న విజయవంతంగా లాంచ్ అయింది. శుక్లా మిషన్ పైలట్‌గా ఉంటారు. కమాండర్‌గా అమెరికా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ బాధ్యతలు చేపట్టారు. ఇది భారత అంతరిక్ష యాత్రలో మరో గొప్ప అధ్యాయంగా నిలవనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates