విపరీతమైన భౌతిక పరిస్థితులు, శూన్యగత వాతావరణం ఉండే అంతరిక్షంలో సాధారణ ఆహార పదార్థాలను తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇస్రో (ISRO) – డిఆర్‌డిఓ (DRDO) కలిసి ఏళ్ల తరబడి చేసిన పరిశోధన ఫలితంగా ఇప్పుడు భారతీయ ఆహారం అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా మారింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రయాణించనున్న సందర్భంగా, ఆయనతో పాటు కొన్ని భారతీయ మిఠాయిలు కూడా రోదసికి వెళ్లనున్నాయి.
అసలైతే ఈ యాత్ర జూన్ 8న జరగాల్సి ఉండగా, వాతావరణం సహకరించకపోవడంతో మళ్లీ జూన్ 10కు వాయిదా వేశారు. అయితే అక్కడ కూడా వర్షం, గాలులు వంటి పరిస్థితుల వల్ల ప్రయోగం నిలిపివేశారు. తాజా సమాచారం ప్రకారం, స్పేస్ ఎక్స్ సంస్థ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 12వ తేదీ సాయంత్రం 5:30 (భారత కాలమానం ప్రకారం) ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతోంది. శుభాంశు ఈ మిషన్‌లో పైలట్‌గా పాల్గొననున్నాడు.
అయితే ఈ ప్రయాణంలో గజర్ కా హల్వా, ముంగ్ దాల్ హల్వా, ఆమ్ రస్ (మామిడి పప్పు) వంటి భారతీయ రుచులను శుభాంశు షుక్లా తీసుకెళ్లనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అత్యంత ఖచ్చితమైన శుద్ధి, స్టెరిలైజేషన్ ప్రక్రియల ద్వారా ఈ ఆహార పదార్థాలను తయారుచేసి, ప్రత్యేకంగా అంతరిక్ష ప్రయాణానికి అనుగుణంగా ప్యాక్ చేశారు. ఎలాంటి రసాయనాలు లేకుండా, మానవ ఆరోగ్యానికి ముప్పు లేకుండా, దీర్ఘకాలం నిల్వ ఉండేలా వీటిని రూపొందించటం విశేషం.
ఈ ప్రత్యేక ఆహారం తయారీకి డిఆర్‌డిఓ పరిధిలోని డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ కీలక పాత్ర పోషించింది. భారతీయ వంటకాల ప్రత్యేకతను అంతరిక్షంలో కూడ అనుభవించేలా రూపొందించడం ఈ సంస్థకు ఓ సవాలే. అయితే ఇప్పుడు అది సాధ్యమైందన్న గర్వంతో శాస్త్రవేత్తలు ఉత్సాహంగా ఉన్నారు. శుభాంశు షుక్లా కూడా తన సొంత రుచులను అంతరిక్షంలో ఆస్వాదించనుండటం ఒక ప్రత్యేక అనుభవం కానుంది.
ఇది కేవలం ఒక వ్యోమగామికి ఆహారాన్ని అందించడమే కాదు, భారత దేశంలోని ఆహార సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతర్జాతీయ స్థాయిలో పరిచయం చేసే అవకాశంగా మారింది. అంతరిక్షంలో భారతీయ వంటల మిన్ను మెరుస్తుండటం దేశ ప్రజలకు గర్వకారణం. భవిష్యత్తులో మరిన్ని వంటకాలు, మరిన్ని ప్రయోగాలు ఈ మార్గంలో జరగనున్నాయని నిపుణులు అంటున్నారు.