నిర్మాత బన్నీ వాస్ ఇవాళ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్టులో కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. మనం రెంటల్, పర్సెంటెజ్ అని గొడవలు పడే కన్నా 28 రోజుల్లో ఓటిటి రిలీజులు జరిగిపోవడం లాంటి సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరారు. అంతే కాదు రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తున్న పెద్ద హీరోలు సీరియస్ గా ఆలోచించాలని, ఇదే ధోరణి కొనసాగితే రాబోయే నాలుగైదేళ్లలో తొంభై శాతం సింగల్ స్క్రీన్లు మూతబడతాయని హెచ్చరించారు. అంతే కాదు కేవలం మల్టీప్లెక్సులు మిగిలిపోయే పరిస్థితి వస్తే నిర్మాతలకు వాటి నుంచి వచ్చే ఆదాయం కేవలం 43 శాతమేనని వాస్తవాలను తేటతెల్లం చేశారు.
ఇక్కడ బన్నీ వాస్ తో పాటు మనం కూడా చూడాల్సిన కోణాలు మరికొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది టికెట్ రేట్లు. టయర్ 2 హీరోల సినిమాలకు సైతం బడ్జెట్ సాకుగా చూపించి జిఓలు తెచ్చుకుంటున్న వైనం గత ఆరేడు నెలలుగా చూస్తున్నాం. బాగున్న సినిమాలకు ప్రేక్షకులు ఎలాగూ పెడతారు. కానీ యావరేజ్, ఫ్లాపులు ఈ ధోరణి వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆఖరికి యూట్యూబ్ లో దొరికే పాత రీ రిలీజులకు సైతం రెగ్యులర్ ధరలనే వసూలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇక స్నాక్స్ సంగతి సరేసరి. మతిపోయేలా పాప్ కార్న్, కూల్ డ్రింక్ల రేట్లతో జరుగుతున్న దోపిడీ గురించి చెబుతూ పోతే చాట భారతమే అవుతుంది.
ఇక అన్నింటి కన్నా అసలు విషయం కంటెంట్ క్వాలిటీ. తీసికట్టు కథలు, రొటీన్ ట్రీట్మెంట్లు, మళ్ళీ వినాలనిపించేలా లేని పాటలు, ట్రెండ్ పేరుతో రిపీట్ చేస్తున్న స్టోరీలు ఇలా సవాలక్ష కారణాలు జనాన్ని థియేటర్లకు రాకుండా చేస్తున్నాయి. బాగుంటే ఎవరూ ఆపలేరు. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, కోర్ట్, క, లక్కీ భాస్కర్ లాంటి హిట్లు విజువల్ ఎఫెక్ట్స్ వాడిన వందల కోట్ల సినిమాలు కాదు. అయినా డబ్బులెలా వచ్చాయ్. సో పబ్లిక్ ని థియేటర్ల దాకా రప్పించాలంటే కంటెంట్ లో నాణ్యత, ధరల మీద అదుపు, హీరోలు వేగం పెంచడం లాంటి వాటి మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఆడియన్స్ అడగకుండానే టికెట్లు కొంటారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates