ఐపీఎల్ ఫైనల్.. ఆకాశం ఏమంటోంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్‌ ఎలాంటి బ్రేక్ లేకుండా జరగాలనే భావంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న.. ఇంతకీ ఆకాశం ఏమంటుంది? ఫైనల్ మ్యాచ్ కు వరుణ దేవుడు అడ్డు పడతాడా అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వాతావరణం గురుత్వంగా మారుతోంది. జూన్ 3న జరగాల్సిన ఈ ఫైనల్‌కు వర్షం రాకుండా ఉండదు. జల్లులు పడే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది.

ఇప్పటికే కోల్‌కతా వేదిక నుండి అహ్మదాబాద్‌కు ఫైనల్ మ్యాచ్‌ను మారుస్తూ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వాతావరణం దృష్ట్యా కీలకమైంది. కానీ ఇప్పుడు అదే అహ్మదాబాద్‌లోనూ వర్షభీతిని ఎదుర్కొనాల్సి వస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం మంగళవారం రోజు మేఘావృతంగా ఉంటుందని, తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెబుతోంది. అభిమానులకు ఇప్పుడు ఒక్కటే ఆశ.. రిజర్వ్ డే ఉపయోగించాల్సిన పరిస్థితి రాకూడదన్నదే.

అయితే, మ్యాచ్‌కు రిజర్వ్ డే (జూన్ 4) ఏర్పాటు చేశారు. వర్షం వల్ల మ్యాచ్ పూర్తవకపోతే మరుసటి రోజు కొనసాగిస్తారు. ఆ రోజూ వర్షం అవరోధం కలిగిస్తే మాత్రం, లీగ్ స్టేజ్‌లో అగ్రస్థానంలో ఉన్న (పంజాబ్) జట్టుకు టైటిల్‌ను ఇస్తారు. దీంతో RCB అభిమానుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కలల కప్ కోసం ఎదురుచూస్తున్న టీమ్ కు వాతావరణం పరీక్షగా మారుతోంది.

గతంలోనూ ఇదే వేదిక వర్షాంతకానికి నిలయంగా మారింది. 2023లో గుజరాత్ vs చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది. ఆ రోజు కూడా పలుమార్లు ఆట ఆగడం చూసిన అభిమానులు ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ తపనకు వరుణుడు వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి.