IPL2025: ఇది నెవ్వర్ బిఫోర్ ఫైనల్!

ఐపీఎల్‌ 2025 సీజన్‌ ఇప్పుడు మరువలేని ఓ ఫైనల్‌కు సాక్ష్యం ఇవ్వబోతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (RCB) Vs పంజాబ్ కింగ్స్ (PBKS) ఫైనల్ మ్యాచ్ ఈసారి ఇరు వర్గాల అభిమానులకి నిజంగా గుండెలు బరువు చేసే మ్యాచ్‌గా మారింది. ఇన్నేళ్లుగా టైటిల్‌ సాధించలేకపోయిన రెండు జట్లూ.. ఒకే లక్ష్యంతో తలపడనున్నాయి. ఇది గోల్డెన్ ఛాన్స్.

RCB ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్ చేరిన జట్టు. 2009లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో ఓటమి, 2011లో చెన్నై చేతిలో ఓటమి, 2016లో సన్‌రైజర్స్ చేతిలో ఓటమి ఎదురైంది. మూడు సార్లు టైటిల్ అందుబాటులోకి వచ్చి చేజారిన బలమైన జ్ఞాపకాలతో ఈసారి నాలుగోసారి ఫైనల్‌కు చేరింది. ఇక విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఈసారి కప్ మాత్రం మనదే అనే నినాదంతో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే ఫైనల్‌కు చేరింది.. అది 2014లో. అప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఎన్నో మార్పులు చేసినా టైటిల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఈసారి మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జట్టు కొత్త ఉత్సాహంతో ఆడుతోంది. క్వాలిఫయర్-2లో ముంబైని ఓడించి RCBపై రివెంజ్ తీర్చుకోవాలన్న సంకల్పంతో ఉన్నారు.

ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇప్పటికే RCB క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడించింది. ఇప్పుడు అదే జట్ల మధ్య రీమాచ్ జరగనుంది. దీంతో పంజాబ్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. అలాగే బెంగుళూరు మాత్రం ఈసారి తప్పకుండా ట్రోఫీ గెలవాలనుకుంటోంది. రెండు యుద్ధాల మధ్య ఎవరి ఆశ నెరవేరుతుందనేది చూడాలి. ఈ రెండు జట్లకి ఇది బెస్ట్ ఛాన్స్. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కోసం, ఫ్రాంచైజీ గౌరవం కోసం, ఆటగాళ్ల గుండెతాడిపై నిలిచిన కల కోసం ఈ పోరు జరగబోతోంది. IPL చరిత్రలో ఇది ప్రత్యేకంగా నిలిచిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.