-->

రిటైర్డ్ ఉద్యోగికి జాక్ పాట్ లాటరీ!

చెన్నైకి చెందిన శ్రీరాం రాజగోపాలన్ అనే రిటైర్డ్ ఇంజినీర్‌ జీవితం ఒక్కసారిగా మలుపు తిప్పింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నిర్వహించిన ‘ఎమిరేట్స్ డ్రా మెగా7’ లాటరీలో ఏకంగా రూ.231 కోట్ల భారీ బహుమతిని గెలుచుకుని ఒక్కరోజులో కోటీశ్వరుడిగా మారిపోయారు. అసలు ఈ టికెట్‌ను ఆయన తన జన్మదినం సందర్భంగా సరదాగా కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు అదే సరదా జీవితం మొత్తాన్ని శాశ్వతంగా మార్చేసింది.

మార్చి 16న తన బర్త్‌డే సందర్భంగా శ్రీరాం ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్‌ను కొన్నారు. మెగా7 లాటరీలో భాగంగా ఏడు నెంబర్లను యాధృచ్ఛికంగా ఎంచుకున్నారు. ఆ లక్కీ నెంబర్లే ఈసారి డ్రాలో గెలుపొందడం అద్భుతంగా మారింది. తొలి విజేతగా ప్రకటించిన సమయంలో శ్రీరాం ఈ విషయాన్ని పూర్తిగా నమ్మలేకపోయారు. రెండుసార్లు వీడియో చూసి, స్క్రీన్‌షాట్‌లు తీసుకున్నాకే నమ్మినట్టు చెప్పారు.

“ఇది పూర్తిగా అదృష్టం వల్లే సాధ్యమైంది. దీని వెనక ఎలాంటి మానవ ప్రయత్నం లేదు. నా సమయం వచ్చింది. జీవితం ఒక్క రోజులో ఇలా మారిపోతుందనుకోలేదు. కానీ ఇప్పుడు నా మీద గొప్ప బాధ్యత కూడా వచ్చింది” అని శ్రీరాం అన్నారు. ఈ విజయం తనకు సంతోషమే కాదు, బాధ్యత కూడా కలిగించిందన్నారు.

శ్రీరాం ఖాళీ సమయంలో ఇంటర్నెట్‌లో బ్రౌజింగ్ చేస్తూ లాటరీలపై ఆసక్తి పెంచుకున్నారని తెలిసింది. ఆ ఆసక్తి ఆధారంగా కొన్ని టికెట్లు కొనడమే ఈ అదృష్టాన్ని అందించిందని పేర్కొన్నారు. తమ జీవితాన్ని మార్చుకునే అవకాశాలు ఎప్పుడైనా రావొచ్చని, వాటిని పట్టుకోవాలంటే నమ్మకమే సరిపోతుందని వ్యాఖ్యానించారు.