తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇతర దేశాల మాట ఎలా ఉన్నా.. మన దేశంలో కూడా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోనే రాత్రికి రాత్రి 25కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక, తమిళనాడు, కేరళ, కర్ణాటకలోని పర్యాటక ప్రాంతాల్లోని వారికి కూడా కరోనా వైరస్ సోకింది. ఏపీలోనూ రెండు కేసులు, తెలంగాణలోనూ రెండు నమోదయ్యాయి. ఈ పరిణామాలతో కేంద్రం సహా.. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
అయితే.. తాజాగా వ్యాపిస్తున్న కోరోనా వైరస్‌పై అధ్యయనం జరిగింది. దీనిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రస్తుతం వ్యాపిస్తున్న వైరస్‌ను నాలుగో రకంగా పేర్కొన్న శాస్త్రవేత్తలు.. ఇది గతం వాటి కంటే కూడా మరింత బలం పుంజుకుందని తెలిపారు. ఈమేరకు ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం తాజాగా వెల్లడించింది. కోవిడ్ కొత్త వేరియంట్లు ఎన్‌బీ.1.8.1, ఎల్‌ఎఫ్.7లుగా గుర్తించినట్టు తెలిపింది. అయితే.. ఇది బలమైన వైరస్సే అయినప్పటికీ.. ప్రమాదకరం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు.
కానీ, లక్షణాలు మాత్రం వంద రెట్ల వేగంతో విస్తరిస్తాయని తెలిపారు. తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్రం కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ.. గతంలో కంటే.. కూడా ఇప్పుడు వేగంగా వైరస్ వ్యాప్తి చెందడం.. తలనొప్పి తీవ్రంగా ఉండడం.. గొంత మంట నొప్పి ఎక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నాయి. ఇదిలావుంటే.. జేఎన్.1, ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్యశాఖ కూడా ప్రకటించింది.
ఏంటి ఉపశమనం..
తాజా వేరియంట్ బారిన పడిన వారు.. వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఎక్కువగా వేడి నీటిని తీసుకోవడం.. జలుబు దగ్గు ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకునే ఔషధాలను వాడాల్సి ఉంటుంది. అలాగే.. చేతులు తరచుగా శుభ్రం చేసుకోవడం.. మాస్కులు ధరించడం ద్వారా కరోనా నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా.. కొత్త వైరస్ బారిన పడిన వారు.. ఎవరూ ఇప్పటి వరకు ప్రాణాపాయ స్థితికి చేరుకున్న వార్తలు కానీ.. ఘటనలుకానీ వెలుగు చూడలేదు.