సూది గుచ్చకుండానే బ్లడ్ టెస్ట్.. ఎలా సాద్యమంటే?

ఇకపై రక్త పరీక్ష చేయించుకోవాలంటే చేతికి సూది పొడవాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇప్పుడు అది వాస్తవం. హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రి వైద్యులు రూపుదిద్దిన కొత్త టెక్నాలజీ “అమృత్ స్వస్థ్ భారత్” టూల్‌తో ఇది సాధ్యమవుతోంది. ఇది పూర్తిగా కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసే హెల్త్ స్కానింగ్ పరికరం. ఇది మన ముఖాన్ని స్కాన్ చేసి, కొన్ని క్షణాల్లోనే బ్లడ్ టెస్ట్ తో పాటు పలు ఆరోగ్య వివరాలను అందిస్తుంది.

ఈ టూల్‌లో వినియోగిస్తున్న ప్రధాన సాంకేతికత పేరు ఫోటోప్లీతిస్మోగ్రఫీ (PPG). దీని ద్వారా ఓ ప్రత్యేకమైన కాంతిని మన ముఖం మీద ప్రసరింపజేస్తారు. ఈ కాంతి మన శరీరంలోని రక్తప్రసరణ, ఆక్సిజన్ పరిమాణం వంటి కీలక అంశాలను గుర్తించగలదు. తేలికపాటి స్కానింగ్‌తోనే హార్ట్ రేట్, హీమోగ్లోబిన్, స్ట్రెస్ లెవెల్స్, బీపీ, ఆక్సిజన్ లెవెల్ వంటి ప్యారామీటర్లను గుర్తించడంలో ఇది సులభంగా పనిచేస్తుంది.

ప్రస్తుతం అమృత్ స్వస్థ్ భారత్ టూల్‌తో ఒక వ్యక్తి ఆరోగ్య పరీక్ష కేవలం 20 నుంచి 60 సెకన్లలో పూర్తవుతుంది. ఇందులో రక్తం బిందువును కూడా తీసే అవసరం ఉండదు. ఇదంతా ఫేస్ స్కానింగ్‌తోనే జరుగుతుంది. దీని వలన పిల్లలు, వృద్ధులు, బలహీన శరీరులైన వారికీ అధిక ప్రయోజనం ఉంటుంది. 

ఈ టూల్‌ను రూపొందించిన నీలోఫర్ వైద్య బృందం గర్వంగా చెబుతోంది “ఇది సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేసే పరికరం. ఊపిరితిత్తుల రోగులు, గర్భిణులు, పిల్లలు వంటి వారికీ అవసరమైన పరీక్షలు వేగంగా చేయవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే టెక్నాలజీ అందుబాటులోకి వస్తే వందలాది మందికి ప్రయోజనం కలుగుతుంది” అని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఈ టెక్నాలజీ భవిష్యత్తులో మెడికల్ సేవల రూపాన్ని పూర్తిగా మార్చే అవకాశముందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. టెక్నాలజీ మన ఆరోగ్య సంరక్షణలో ఈ స్థాయిలో అడుగులు వేయడం గొప్ప పరిణామం అని వారు చెబుతున్నారు.