AIని డెవలప్ చేస్తే.. చివరికి దాని వల్లే మోసపోయారు!

ఈ మధ్యకాలంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత సాధారణమైపోయింది. ప్రత్యేకంగా అమెరికాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఐటీ దిగ్గజాలు తమ నైపుణ్యాన్ని గల సిబ్బందికే ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ సంస్థ 6,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఇందులో మూడింట ఒక వంతు మంది కేవలం ఏఐ టెక్నాలజీపై పనిచేసే వారే కావడం గమనార్హం.

ఇంతకీ సమస్య ఎక్కడిదంటే, సంస్థ భవిష్యత్తు కోసం రూపొందించిన కృత్రిమ మేధ వ్యవస్థలే ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నాయి. అమెరికా వాషింగ్టన్ కార్యాలయంలో తొలగించిన ఉద్యోగుల్లో 40 శాతం మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కాగా, వీరిలో చాలామంది గతంలో సంస్థే సూచించినట్లుగా ఏఐ టూల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టినవారే. ఓపెన్ ఏఐ ఆధారిత చాట్‌బాట్‌లను కోడింగ్‌కు ఉపయోగించమన్న అధికారి సూచనలనే వారు అమలు చేశారు. అదే ఇప్పుడు వారి ఉద్యోగాలకు అడ్డు అయ్యిందన్నది వాస్తవం.

జూనియర్ కోడర్స్‌, టెక్నికల్ మేనేజర్స్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్ విభాగాల్లో పనిచేస్తున్నవారికి ఈ సారి అధికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. స్టార్టప్‌లలో పని చేస్తున్న ఏఐ డైరెక్టర్లకు కూడా ఈ కోత తగలడమే కాకుండా, సొంతంగా ఏఐ టూల్స్ అభివృద్ధికి తోడ్పడిన వారికీ ఉద్వాసన పలకడం అందరిలో ఆవేదన రేకెత్తిస్తోంది.

ఈ తొలగింపులపై మైక్రోసాఫ్ట్ ఒక ప్రతినిధి స్పందిస్తూ, సంస్థ నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు మార్పులు అవసరమయ్యాయని తెలిపారు. కోత అనివార్యమని, టెక్నాలజీలో ముందంజ వేయాలంటే కొంత త్యాగం తప్పదని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా సంస్థ 10 వేల మందిని తొలగించింది. ఇప్పుడు ఇది రెండో అతిపెద్ద తొలగింపు.

సత్యనాదెళ్ల ఇటీవలే 30 శాతం కోడింగ్‌ను ఏఐతోనే చేస్తామని చెప్పిన మాటలు నిజమవుతున్నాయనిపిస్తోంది. కానీ అదే టెక్నాలజీ ఉద్యోగులను తొలగించడానికి కారణమవుతోంది. ఇదే టెక్ రంగ భవిష్యత్తా..? అనేది ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారుతోంది.