-->

‘పాక్‌’ మీద కోపం మైసూర్ పాక్‌ మీద చూపిస్తున్నారు

మైసూర్ పాక్‌.. లొట్ట‌లేయిస్తూ.. మ‌రీ మ‌న‌ల్ని ఆక‌ర్షించే మిఠాయిల్లో ఈ స్వీట్ ప్ర‌త్యేక‌తే వేరు. సంప్ర‌దాయ మిఠాయిల్లో ల‌డ్డూ త‌ర్వాత‌.. స్థానం మైసూర్ పాక్‌దే. ఇప్ప‌టికీ ఎన్ని అధునాత‌న ర‌కాల స్వీట్లు అందుబాటులోకి వ‌చ్చినా.. పెళ్లిళ్లు, విందులు, గృహ ప్ర‌వేశాలు వంటివి జ‌రినిప్పుడు.. ల‌డ్డూ వెంట‌.. మైసూర్ పాక్ ఉండి తీరుతుంది. అయితే.. ఇప్పుడు తాజాగా మైసూర్ పాక్‌ లోని పాక్ అనే ప‌దాన్ని దేశ‌వ్యాప్తంగా నిషేధించాల‌ని రాజ‌స్థాన్ మిఠాయి దుకాణాల య‌జ‌మానులు పిలుపునిచ్చారు. తాము తొలి అడుగుగా.. త‌మ రాష్ట్రంలో ఉన్న మిఠాయి దుకాణాల్లో మైసూర్ పాక్ పేరును ఇక నుంచి మైసూర్ శ్రీగా పిల‌వ‌నున్న‌ట్టు పేర్కొన్నారు.

ఎందుకు?

పాకిస్థాన్ పెంచి పోషించిన ఉగ్ర‌వాదులు.. గ‌త నెల 22న జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గాంలో దాడులు చేసి 26 మందిని పొట్ట‌న పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ వ్య‌వ‌హారం.. భార‌త్‌ను తీవ్రంగా క‌ల‌చి వేసి ఆప‌రేష‌న్ సిందూర్ వైపు న‌డిపిం చింది. ఈ క్ర‌మంలోనే పాకిస్తాన్ పేరు వినేందుకు.. త‌లుచుకునేందుకు కూడా దేశ ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే పాక్‌ పేరుతో ముడిప‌డిన అన్ని పేర్ల‌ను కూడా నిషేధించాల‌న్న ఉద్య‌మం.. సోష‌ల్ మీడియా వేదికగా జ‌రుగుతోంది. దీనిపై స్పందించిన ప‌లువురు పాక్ అనే పేరుతో ముడిప‌డిన అన్నింటినీ నిషేధించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా.. రాజ‌స్తాన్‌లోని ఓ మిఠాయి దుకాణం య‌జ‌మాని త‌న షాపులో విక్ర‌యించే మైసూర్ పాక్ పేరును మార్పు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి.. దీనికి మైసూర్ శ్రీగా పేరు పెట్టాడు. ఇది న‌చ్చిన మిగిలిన వారు కూడా.. దేశ‌వ్యాప్తంగా అంద‌రూ ఇదే త‌ర‌హాలో పేర్లు పెట్టాల‌ని పిలుపునిచ్చారు. ఇదొక్క‌టే కాకుండా.. స‌ద‌రు య‌జ‌మాని .. మోతీ పాక్‌, ఆమ్‌ పాక్‌, గోండ్‌ పాక్‌ పేర్లను మార్చి.. మోతీ శ్రీ, ఆమ్‌ శ్రీ, గోండ్‌ శ్రీ అని కొత్త పేర్లు పెట్టడం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ కావ‌డం గ‌మ‌నార్హం.