=

ఐపీఎల్‌లో మళ్ళీ మళ్ళీ అతి.. ఒక మ్యాచ్ నిషేధం

దిగ్వేష్ రాఠి.. ఈ ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు దొరికిన ఆణిముత్యం. ఢిల్లికి చెందిన ఈ యువ స్పిన్నర్‌ను 30 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది లక్నో జట్టు. ఐతే ఈ స్పిన్నర్ మైదానంలో అతిగా ప్రవర్తించడం వల్ల ఇప్పటిదాకా అతడికి పడిన జరిమానా 30 లక్షల కంటే ఎక్కువే కావడం గమనార్హం. ప్రతిభకు లోటు లేకపోయినా.. ప్రవర్తనలో అతి వల్ల దిగ్వేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. నోట్ బుక్‌లో ఏదో రాస్తున్నట్లుగా అతను సంబరాలు చేసుకునే తీరు తీవ్ర విమర్శల పాలైంది.

ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అంటే ఓకే కానీ.. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్ పడగానే బ్యాట్స్‌మన్‌ను కవ్విస్తున్నట్లుగా అతను సంబరాలు చేసుకునే వైనం టూమచ్ అనిపిస్తోంది. ఇప్పటికే ఇలా పదే పదే సంబరాలు చేసుకుని జరిమానాలు ఎదుర్కొన్నాడు దిగ్వేష్. సోమవారం రాత్రి సన్‌రైజర్స్ మ్యాచ్‌లోనూ ఇదే చేశాడు. మొదట ఇషాన్‌ కిషన్‌ను ఔట్ చేసినపుడు.. తర్వాత అభిషేక్ శర్మ‌ ఔటైనపుడు అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇషాన్ పట్టించుకోలేదు కానీ.. అభిషేక్‌కు దిగ్వేష్ అతి నచ్చలేదు. అతడితో వాదనకు దిగాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది.

ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించినా దిగ్వేష్ మారకపోవడంతో ఈసారి ఐపీఎల్ నిర్వాహకులు కొరడా ఝళిపించారు. మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించడంతో పాటు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నందుకు దిగ్వేష్ మీద ఒక మ్యాచ్ నిషేధం విధించారు. దీంతో గుజరాత్‌తో తర్వాత జరిగే మ్యాచ్‌కు దిగ్వేష్ దూరమయ్యాడు. అభిషేక్ మ్యాచ్ ఫీజులోనూ 25 శాతం కోత పడింది. దిగ్వేష్‌ను సన్‌రైజర్స్ అభిమానులు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్సే గెలవడం.. అభిషేక్ ఔటయ్యాక కమిందు మెండిస్ దిగ్వేష్‌ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించడం.. తర్వాత దిగ్వేష్ మీద ఒక మ్యాచ్ నిషేధం పడడంతో అతడి తిక్క కుదిరిందని కామెంట్లు చేస్తున్నారు.