పాక్‌కు చెందిన జెండాలు, లోగోలు ఉన్న వస్తువులు దేశీయ ఈ-కామర్స్ వేదికలపై విక్రయానికి చేరడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ప్రముఖ సంస్థలు దేశ ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన సమయంలో, ఇలా వివాదాస్పద వస్తువులకు చోటివ్వడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నిత్యం చురుగ్గా పనిచేస్తున్న సీసీపీఏ ఈ అంశంపై నోటీసులు జారీ చేసి, తక్షణమే అలాంటి ఉత్పత్తులను తొలగించాలంటూ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విటర్ వేదికగా స్పందించారు. “ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, జాతీయ గౌరవాన్ని దెబ్బతీసే తీరుగా చూస్తున్నాం. దేశ చట్టాల ప్రకారం ఇటువంటి కంటెంట్‌ను తక్షణమే తొలగించాలి” అని హెచ్చరించారు. దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, యూబై ఇండియా, ఎట్సీ, ది ఫ్లాగ్ కంపెనీ, ది ఫ్లాగ్ కార్పొరేషన్ సంస్థలకు నోటీసులు పంపినట్లు వెల్లడించారు.
ఇక మరోవైపు, సీఏఐటీ నేతలు ఈ వ్యవహారాన్ని కేంద్రానికి లేఖ రాస్తూ ఎత్తిచూపారు. “మన సైన్యం ఆపరేషన్ సిందూర్‌లో పాక్ మద్దతుదారులపై ఉక్కుపాదం మోస్తున్న సమయంలో, దేశ వ్యాపార వేదికలపై పాకిస్థాన్ జెండాలు అమ్మకానికి పెట్టడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది” అని పేర్కొన్నారు. ఇది కేవలం పొరపాటు కాదు, దేశ భద్రత, ప్రజల ఐక్యతపై ముప్పుగా భావించాలన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు సంబంధిత ఈ-కామర్స్ సంస్థలు తక్షణమే స్పందిస్తాయా? లేదా అనే విషయం మీద ప్రజల్లో ఆసక్తి నెలకొంది.