భారత్‌తో స్నేహాన్ని చాటుకుంటూనే ట్రంప్ వ్యవహరించిన తీరు వెన్నుపోటు అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల భారత్ పాక్ వ్యవహారంలో కన్నింగ్ గా స్పందించిన ట్రంప్ ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెట్టె అగ్ర సంస్థలను వెనక్కి లాగుతున్నాడు. ఈసారి ఆపిల్ పోటుతో షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు. అగ్ర ప్రపంచ బ్రాండ్ ఆపిల్ భారత్‌ను తన తయారీ కేంద్రంగా మలుస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ వ్యూహానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు.
ఇటీవల ఖతార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ, భారత్‌లో ఆపిల్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించవద్దని తాను ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌ను కోరినట్లు తెలిపారు. “అమెరికాలోనే ఉత్పత్తులు చేయాలి” అనే తన భావజాలాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. టిమ్ కుక్‌తో జరిగిన సంభాషణను వివరిస్తూ, “ఆపిల్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. నిన్ననే కుక్‌తో మాట్లాడాను. భారత్‌లో నిర్మించొద్దని చెప్పాను” అని ట్రంప్ వెల్లడించారు.
భారత్ అమెరికా ఉత్పత్తులపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటని ట్రంప్ మండిపడ్డారు. ఆపిల్ సైతం అమెరికాలో ఉత్పత్తులు పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. చైనా మీద అమెరికా సుంక భారం పెంచిన తర్వాత, అనేక కంపెనీలు తమ ఉత్పత్తిని భారత్ తరహా దేశాలకు మార్చుతున్నాయి. అందులో ఆపిల్ ప్రాధాన్యత ఇవ్వడంలో భారత్ ముందుండడం గమనార్హం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో తయారైన ఐఫోన్ల విలువ 22 బిలియన్ డాలర్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 60 శాతం అధికం.
ఆపిల్ ఇప్పటికే తమిళనాడులోని ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ ప్లాంట్ల ద్వారా భారీ ఉత్పత్తి చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా పథకానికి ఆపిల్ గట్టి మద్దతు ఇస్తుండటంతో, విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరుగుతోంది. ఇక 2025 నాటికి అమెరికాలో అమ్మే ఐఫోన్లలో 25 శాతం వరకు భారత్ నుంచే వస్తాయని అంచనా. ట్రంప్ వ్యాఖ్యలు ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో రాజకీయ స్పష్టత కలిగించినప్పటికీ, గ్లోబల్ టెక్ రంగం మారుతున్న వ్యూహాల్లో భారత్ కీలక భాగంగా మారడం మాత్రం మారదు. అమెరికా-భారత్ వ్యాపార సంబంధాలపై ఈ అభిప్రాయ భేదం ఎంత ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.