శుభాంశు స్పేస్ యాత్రకు బ్రేక్.. మళ్ళీ న్యూ డేట్!

భారత వైమానిక దళాధికారి శుభాంశు శుక్లా జరపాల్సిన అంతరిక్ష యాత్రకు తాత్కాలిక విరామం ఏర్పడింది. మే 29న జరగాల్సిన యాక్సియమ్-4 మిషన్ ప్రయోగాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యాక్సియమ్ స్పేస్ సంయుక్తంగా జూన్ 8వ తేదీకి వాయిదా వేసాయి. ఎందుకంటే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉన్న ప్రయోగాల షెడ్యూల్‌ను సమీక్షించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాసా అధికారికంగా ప్రకటించింది. షెడ్యూల్స్ లో ఎక్కడ కూడా క్లాష్ రాకూడదు అనే ఆలోచనతోనే వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

జూన్ 8న సాయంత్రం 6:41కి ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ప్రయోగం జరగనుంది. ఈ మిషన్‌లో శుభాంశుతో పాటు హంగేరీ, పోలాండ్ దేశాలకు చెందిన వ్యోమగాములు కూడా భాగం కానున్నారు. ఈ దేశాల చరిత్రలో ఐఎస్ఎస్ ప్రయాణం ఇదే మొదటిది కావడం గమనార్హం. మిషన్ కమాండర్‌గా సీనియర్ అమెరికన్ వ్యోమగామి పెగ్గీ విట్సన్ వ్యవహరించనున్నారు.

ఈ యాత్రలో శుభాంశు ఏడు సాంకేతిక ప్రయోగాలను చేపట్టనున్నారు. ముఖ్యంగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థుల్లో భారత వంటకాలపై ప్రయోగాలే హైలైట్ కానున్నాయి. మెంతి, పెసర మొలకలు ఇలా మన సంప్రదాయ ఆహారాలను అంతరిక్షంలో ఎలా పెంచవచ్చో, వాటి జీవన విధానాన్ని అధ్యయనం చేయనున్నారు. ఇస్రో నుంచి అందుతున్న పరిశోధనా అంశాలు ఈ ప్రయోగంలో కీలకం కానున్నాయి.

ఇక భారత్ 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుచేయాలనే లక్ష్యాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. 2047లో వ్యోమగాములను చంద్రుడిపైకి పంపేందుకు ప్రయత్నాలు మొదలైపోయాయి. ఈ నేపథ్యంలో శుభాంశు శుక్లా యాత్ర, వారి పరిశోధనలు భారత్‌కు వ్యోమగామ శక్తిగా గుర్తింపు తీసుకురావడంలో కీలకంగా మారనున్నాయి. ఈ మిషన్ విజయవంతమైతే, భవిష్యత్తులో దేశీయ వ్యోమగాముల కోసం మరిన్ని అవకాశాలు తెరవనుంది.