=

ఐపీఎల్.. గుడ్ న్యూస్ వచ్చింది కానీ..

ఐపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మే 17 నుంచి మ్యాచ్‌లు పునఃప్రారంభం కానున్నాయని అధికారికంగా ప్రకటించడంతో క్రికెట్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. అయితే ఈ సారి షెడ్యూల్‌లో తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా పాస్ ఇచ్చేయడం ఇక్కడి ఫ్యాన్స్‌కు షాక్‌లా మారింది. దేశవ్యాప్తంగా ఆరు వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ… ముంబయి, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, లక్నో, అహ్మదాబాద్‌లకు మాత్రమే అవకాశం కల్పించింది. 

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం, విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియాలకు షెడ్యూల్‌లో చోటు లేకపోవడం ఆవేదనకు గురిచేస్తోంది. గతంలో ఎప్పుడు ఐపీఎల్ మూడో విడత జరిగినా కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఈ రెండు స్టేడియాల్లో జరగడం ఆనవాయితీగా ఉండేది. భారత్–పాక్ ఉద్రిక్తతల కారణంగా లీగ్‌కు బ్రేక్ పడిన తర్వాత, బీసీసీఐ తిరిగి షెడ్యూల్‌ రూపొందించబోతుందన్న వార్తలు వినిపించగా, దక్షిణ భారతంలోని స్టేడియాలు, ముఖ్యంగా హైదరాబాద్, విశాఖలకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని భావించారు. 

కానీ ఫైనల్ షెడ్యూల్ చూసి ఇక్కడి అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. పునఃప్రారంభమైన ఐపీఎల్‌లో మొత్తం 17 లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా, ప్లేఆఫ్స్ వేదికల్ని బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. కనీసం క్వాలిఫయర్స్ లేదా ఎలిమినేటర్‌ మ్యాచ్ హైదరాబాద్‌ లేదా విశాఖకు ఇవ్వకపోతే, ఇది పూర్తిగా నెగ్లెక్ట్‌గా మిగిలిపోతుంది అనే వాదనలూ వినిపిస్తున్నాయి. అయినా సన్ రైజర్స్ ప్లే అప్స్ కి వెళ్ళలేదు కాబట్టి ఎక్కడ జరిజితే ఏంటీ అని మరికొందరు తెలుగు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వారికిది బీసీసీఐ నుంచి వచ్చిన తీపి-కారం మిక్స్‌డ్ ట్రీట్‌గా మారింది.