టోర్నమెంట్ ఆగిపోయినా నష్టం లేదు

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ 2025ను వారం పాటు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. 57 మ్యాచ్ లు జరిగిన తరువాత సగంలో ఆపేయడం అనేది మాములు విషయం కాదు. అయితే ఇప్పుడు అందరి మనసులో ఒక్క ప్రశ్నే మెదులుతోంది.. టోర్నమెంట్ రద్దయితే బీసీసీఐ, ఫ్రాంచైజీలకు ఎంత నష్టం జరుగుతుంది. ఆటగాళ్ల వేతనం పరిస్థితి ఏమిటి అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. కానీ అసలు నిజం ఏంటంటే, ఐపీఎల్ రద్దు అయినా ఎవరికీ నష్టం జరగదు.

దీనికి వెనక పెద్ద కారణం బీసీసీఐ తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు. బీసీసీఐ ప్రతి సీజన్‌కు బీమా పొందుతూ ఉంటుంది. మనం సాధారణంగా కార్లు, బైక్‌లు, మొబైల్స్, ఆరోగ్యానికి బీమా తీసుకునే విధంగా, ఐపీఎల్ లీగ్‌కి కూడా పెద్ద స్థాయిలో బీమా తీస్తారు. ఈ పాలసీ ద్వారా ఏదైనా మ్యాచ్ రద్దయినా, లేదా టోర్నమెంట్ నిలిచిపోయినా వచ్చే నష్టం బీమా కంపెనీలు భర్తీ చేస్తాయి.

ఇది మాత్రమే కాదు, ప్రతి జట్టు తమ ఆటగాళ్లకు కూడా బీమా పొందుతుంది. అంటే, ఏ ఆటగాడు గాయపడ్డా, లేదా అనుకోని పరిస్థితులు ఎదురైనా అతని చికిత్స ఖర్చు మొత్తాన్ని బీమా కవర చేస్తుంది. ఫలితంగా ఫ్రాంచైజీలు ఎటువంటి ఆర్థిక భారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక రకంగా జట్లను సేఫ్ జోన్‌లో ఉంచే ప్లాన్.

మరొక ముఖ్య విషయం ఏమిటంటే, మ్యాచ్‌లు రద్దయితే స్పాన్సర్లతో ఉన్న ఒప్పందాల ప్రకారం బీసీసీఐకు పరిహారం అందుతుంది. అంటే, మ్యాచ్‌లు ఆగిపోవడం వల్ల ప్రత్యక్ష ఆదాయం తగ్గినా, బీమా వల్ల వచ్చే పరిహారంతో ఆ లోటును పూరించుకోవచ్చు. ఇక్కడ కూడా బీసీసీఐ చురుకైన ప్లానింగ్ కనిపిస్తుంది. ఇక పరిస్థితి చక్కబడితే కొత్త షెడ్యూల్‌తో మళ్లీ ఐపీఎల్ తిరిగి వచ్చేస్తుంది.